స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇవి ఎన్నో రకాల శిలీంధ్రాల వల్ల వస్తాయి. పరిశుభ్రతను పాటిస్తే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.
స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను డెర్మాటోఫైటోసిస్ అని కూడా అంటారు. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే సాధారణ సమస్య. ఈ అంటువ్యాధులు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా వృద్ధి చెందే రకరకాల శిలీంధ్రాల వల్ల వస్తాయి. శిలీంధ్రాలు ప్రతి ఒక్కరి చర్మంపై ఉంటాయి. కానీ అవి నియంత్రణ లేకుండా పెరిగినప్పుడు మాత్రమే సంక్రమణకు కారణమవుతాయి. ఈ చర్మ అంటువ్యాధులు ఒక సాధారణ సమస్య.
స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణాలు
dermatophytes, yeasts, moulds చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాల అత్యంత సాధారణ రకాలు. ఈ శిలీంధ్రాలు నేలమీద, జంతువులపై, మనుషులపై ఉంటాయి. ఇవి సోకిన వ్యక్తితో లేదా జంతువుతో ప్రత్యక్ష సంబంధం ద్వారా లేదా టవల్స్, దువ్వెనలు, దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేసుకోవడం వల్ల ఇవి మీకు వ్యాప్తి చెందుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో లేదా డయాబెటిస్ లేదా హెచ్ఐవి వంటి ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.
చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఫంగస్ రకం, ప్రభావిత ప్రాంతాన్ని బట్టి మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. దురద, చర్మం ఎర్రగా మారడం,వృత్తాకార దద్దుర్లు దీనికి కొన్ని లక్షణాలు. కొన్ని సందర్భాల్లో సంక్రమణ బొబ్బలు లేదా చీము నిండిన గడ్డలకు కారణం కావొచ్చు.
స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణ
చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడం అంటే వాటికి కారణమయ్యే శిలీంధ్రాలకు గురికాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవడమని అర్థం. దీన్ని నివారించేందుకు ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మాన్ని పొడిగా ఉంచాలి
శిలీంధ్రాలు వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలోనే ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందుకే మీ చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని బాగా ఆరనివ్వండి. జుట్టులోని తేమను తొలగించడానికి టవల్ ఉపయోగించండి.
వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి
బిగుతుగా ఉండే దుస్తులు మీ చర్మాన్ని మరింత తేమగా ఉంచుతాయి. శిలీంధ్రాలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. మీ చర్మం శ్వాస తీసుకోవడానికి వీలుకల్పించే వదులుగా ఉండే దుస్తులనే వేసుకోండి.
పరిశుభ్రత పాటించాలి
మీ చేతులను క్రమం తప్పకుండా కడుక్కోండి. గోర్లు పెరగకుండా జాగ్రత్త పడండి. అలాగే వాటిని సబ్బు, నీటితో తరచుగా కడుగుతూ ఉండండి. టవల్స్, దువ్వెనలు, దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తుంది.
యాంటీ ఫంగల్ ప్రొడక్ట్స్ వాడండి
మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల చరిత్ర ఉన్నా లేదా వాటిని అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నా యాంటీ ఫంగల్ ఉత్పత్తులను తప్పకుంగా ఉపయోగించండి. వీటిలో ఓవర్ ది కౌంటర్ క్రీములు, పౌడర్లు, స్ప్రేలు, అలాగే ప్రిస్క్రిప్షన్ మందులు ఉండొచ్చు.
చెప్పులు లేకుండా నడవడం మానుకోండి
బహిరంగ ప్రదేశాలలో శిలీంధ్రాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. శిలీంధ్రాలు మీకు సోకూడదంటే బహిరంగ ఈ ప్రాంతాలలో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు లేదా ఫ్లిప్-ఫ్లాప్స్ వేసుకోండి.
