ఆడవాళ్లు, మగవాళ్లు అంటే తేడా లేకుండా ఆల్కహాల్ ను తాగుతుంటారు. దీని రుచి ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే ప్రతిరోజూ తాగేవాళ్లున్నారు. మోతాదులో తాగితే మంచిదే అని కొన్ని అధ్యయనాలు చెబితే ఇంకొన్ని కొంచెం తాగినా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నాయి. ఏదేమైనా ఆల్కహాల్ పాణానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్ని రోగాలొస్తాయో తెలిస్తే మీరు ఇక నుంచి ఈ అలవాటును మానుకుంటారు తెలుసా?
పెళ్లిళ్లు, ఫంక్షన్లు అంటూ ప్రతి పండుగకు మందు పక్కాగా ఉండాల్సిందే. కొందరైతే కారణాలు వెత్తుక్కుని మరీ ప్రతిరోజూ తాగుతుంటారు. కానీ ఆల్కహాల్ మీ శరీరానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా ఒకేసారి గ్లాసులకు గ్లాసులు లాగిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె నుంచి కడుపు వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజుల్లో తక్కువయ్యే రోగాలు కాదు.. దీర్ఘకాలం పాటు మీతోనే ఉండే రోగాలు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. అసలు అల్కహాల్ మీ శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు
మందును ఎక్కువగా తాగితే మీ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. మందును మోతాదుకు మించి తాగినప్పుడు మీ పేగులు మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయకుండా ఆపుతాయి. అంతేకాదు ఫుడ్ నుంచి పోషకాలను, విటమిన్లను బాగా గ్రహిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ ను హెవీగా తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు, కడుపు ఫుల్ గా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు మందు మీ కడుపు పొరను చికాకుపెడుతుంది. దీంతో కడుపులో ఆమ్లాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అలాగే పేరుకుపోతాయి. దీనివల్ల కడుపు పూతలు, దీర్ఘకాలిక మంట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది అంతర్గత రక్తస్రావాన్ని కూడా కలిగిస్తుంది.
రక్తపోటు పెరుగుతుంది
రక్తనాళాల గోడలపై రక్తం బలం స్థిరంగా మరీ ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్ రక్తపోటును పెంచడమే కాదు గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగితే రక్తనాళాలలోని కండరాలు ప్రభావితం అవుతాయి. ఇవి ఇరుగ్గా మారుతాయి. అంతేకాదు అవి బాగా దెబ్బతింటాయి కూడా. మాయో క్లినిక్ ప్రకారం.. ఒకే సిట్టింగ్ లో మూడు లేదా అంతకంటే ఎక్కువ పెగ్గులను తీసుకుంటే రక్తపోటు అమాంతం పెరుగుతుంది. ఇలాగే రోజూ తాగితే మీకు దీర్ఘకాలిక రక్తపోటు సమస్య వస్తుంది.
కాలెయం దెబ్బతింటుంది
ఆల్కహాల్ ను తాగిన తర్వాత అది కడుపులో శోషించబడుతుంది. ఆ తర్వాత ఇది మీ రక్తంలోకి ప్రవేశించి కాలెయంలోకి వెళుతుంది. కాలెయం అతిపెద్ద అంతర్గత అవయవం. అయితే ఈ కాలెయం ఆల్కహాల్ ను విచ్ఛిన్నం చేయడానికి ఎంజైమ్లను రిలీజ్ చేస్తుంది. అయితే ఒకే సారి లేదా ప్రతిరోజూ ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల ఆల్కహాల్ జీవక్రియ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల కొవ్వు కాలెయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలెయ నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నాడీ సంబంధిత సమస్యలు
ఆల్కహాల్ మెదడులోని రసాయనాలను నెమ్మదింపజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏకాగ్రత, మానసిక స్థితి, దృష్టి సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.ఆల్కహాల్ బ్రెయిన్ కమ్యూనికేషన్ మార్గాలకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు మెదడు పనిచేసే విధాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీ కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, జలదరింపు, మాట్లాడటంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు జ్ఞాపకశక్తి సమస్యలు, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్యాంక్రియాస్ వాపు
ఆల్కహాల్ మితిమీరి తాగితే ప్యాంక్రియాస్ వాపు వస్తుంది. ఫలితంగా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ప్యాంక్రియాస్ జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు ఈ అవయవం మీ శరీరం చక్కెర ను ప్రాసెస్ చేసే విధానాన్ని నియంత్రించడానికి సహాయపడే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. అయితే ప్యాంక్రియాస్ లో దీర్ఘకాలిక మంట ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.అందుకే ఇకపై ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకండి. వీలైతే ఈ అలవాటును మొత్తమే వదులుకోవడం బెటర్.
