మజ్జిగను ఎండాకాలంలో ప్రతిరోజూ తాగాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. 

భారతదేశమంతటా అనేక రాష్ట్రాల్లో ఒక గ్లాసు మజ్జిగను సాధారణ భోజనంతో పాటు ఖచ్చితంగా తాగుతుంటారు. ఇది సర్వసాధారణ విషయం. సాధారణంగా ఎండాకాలంలో మజ్జిగను ఖచ్చితంగా తాగుతుంటారు. ఇది పెరిగిన వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిజానికి మజ్జిగకు చలువ చేసే గుణముంటుంది.

మజ్జిగను ఉప్పగా, స్పైసీ ఫ్లేవర్స్ లో తీసుకుంటారు. నల్ల మిరియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు వంటి మసాలాలను నల్ల ఉప్పుతో మజ్జిగలో కలిపితే రుచి అద్బుతంగా ఉంటుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఎండాకాలంలో మజ్జిగను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మజ్జిగ ఎసిడిటీని నియంత్రిస్తుంది:

ఆయిల్, స్పైసీ ఫుడ్ కారణంగా.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. దీనివల్ల గుండెల్లో మంట వస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపులోని ఎసిడిటీని నార్మల్ చేస్తుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఎండబెట్టిన అల్లం పొడి, మిరియాలు కలిపి తీసుకుంటే ఎసిడిటీ దూరం అవుతుంది.

మజ్జిగ దంతాలు, ఎముకలకు మంచిది

మజ్జిగ కాల్షియానికి మంచి మూలం. ఇది మన ఎముకలు, దంతాలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాల్షియం మన ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. తగినంత మొత్తంలో కాల్షియాన్ని తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 

మజ్జిగ రక్తపోటును నియంత్రిస్తుంది

ఒక గ్లాసు మజ్జిగ కూడా రక్తపోటును క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మజ్జిగను రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గి గుండెజబ్బులు, రక్తపోటు ఉన్నవారికి సహాయపడుతుంది.