సీజనల్ ఫుడ్ ను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఒకప్పుడు కాలానికి దగ్గట్టు పంటలు పండించేవారు. అంటే ఏ కాలంలో వేటిని పండించాలో వాటిని మాత్రమే పండించేవారు. ఇప్పుడు కాలాలతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోని పంటలను పండిస్తున్నారు. నిజానికి కాలానుగుణ ఆహారాన్ని తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే వీటిలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. సీజనల్ ఫుడ్స్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యానికి మంచిది
కాలానుగుణ ఆహారాలే ఆరోగ్యానికి మంచివి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేరే సీజన్ లో పండించాల్సిన ఆహారాల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కూడా. ముఖ్యంగా వీటిని పండించడానికి కెమికల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వాటిలోని పోషక విలువను మరింత తగ్గిస్తుంది. కానీ కాలానుగుణ ఆహారాలను పండించడానికి ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఎండాకాలంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే బెర్రీలను కూడా ఎంచక్కా తినొచ్చు. ఫైబర్, విటమిన్ ఎ ఎక్కువగా ఉండే గుమ్మడికాయ శీతాకాలంలో తినాలి.
మంచి రుచి
కాలానుగుణ ఆహారాలు ఇతర సీజన్లలో పండాల్సిన ఆహారాల కంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటాయి. అయితే ఇతర సీజన్లలో పండించాల్సిన వాటిని పూర్తిగా పండకముందే కోస్తారు. దీంతో వాటి రుచి అంతగా ఉండదు. అందులోనూ ఇవి రసాయలమీదే ఎక్కువగా పండుతాయి. లేదా పెరిగేందుకు సహాయపడటానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇది వాటి రుచిని మరింత తగ్గిస్తుంది. సీజనల్ ఫుడ్స్ తినడం వల్ల మీరు ఆ ఫుడ్ రుచిని పూర్తిగా ఆస్వాదించొచ్చు.
పర్యావరణ అనుకూలం
కాలానుగుణంగా తినడం వల్ల పర్యావరణానికి కూడా మంచిది. ఎందుకంటే వేరే సీజన్లలో పండించాల్సిన వాటిని ఈ సీజన్ లో పండించాల్సి వస్తే వాటికి పక్కాగా రసాయనాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇవి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి.
సరసమైన ధరలు
సీజనల్ ఫుడ్స్ కు ఎక్కువ రేటు ఏం ఉండదు. ఎందుకంటే దీనికి ఖరీదైన రవాణా లేదా నిల్వ అవసరం లేదు. అందులోనూ సీజన్ పండ్లు, కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి తక్కువ ధరే ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటాయి.
