గ్లాకోమా గురించి ఎన్నో అపోహలున్నాయి. ఈ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్నప్పుడు వారి పరిస్థితి దారుణంగా మారుతుందని నమ్ముతారు. మరి దీనిలో నిజమెంతంటే..  

గ్లాకోమాను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఇది తీవ్రమైన కంటి వ్యాధి. ఇది ఆప్టిక్ నరాలకి నష్టాన్ని కలిగిస్తుంది. ఇది కోలుకోలేని దృష్టి నష్టం, అంధత్వానికి కూడా దారితీస్తుంది. దీనికి తోడు ఈ వ్యాధి గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. సకాలంలో రోగ నిర్ధారణ చేయకపోతే గ్లాకోమా శాశ్వత దృష్టి నష్టాన్ని వేగవంతం చేస్తుంది లేదా అంధత్వానికి దారితీస్తుంది. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దలందరూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్లాకోమా కోసం సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవాలి. ఏదేమైనా 40 ఏళ్లు పైబడినవారు లేదా వ్యాధి కుటుంబ చరిత్ర ఉన్నవారు ప్రతి 1 నుంచి 2 సంవత్సరాలకు ఫ్రీక్వెన్సీని పెంచాలి. గ్లాకోమాకు చికిత్స చేయకపోతే లేదా ఆలస్యంగా నిర్ధారణ అయితే కోలుకోలేని దృష్టి నష్టం జరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా తనిఖీలు చేయండి. అసలు గ్లాకోమా గురించి ఎలాంటి విషయాలను నమ్మొద్దో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గ్లాకోమా వృద్ధులను ప్రభావితం చేస్తుంది

60 ఏండ్ల వారితో పోలిస్తే 40 ఏళ్లు పైబడిన వారికి ఓపెన్-యాంగిల్ గ్లాకోమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ శిశువుల లాగే చిన్నవారిని ప్రభావితం చేసే ఇతర రకాల గ్లాకోమా ఉన్నాయి. అందుకే గ్లాకోమాను నిర్దారించడానికి అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. 

గ్లాకోమాకు చికిత్స లేదు

లక్షణాలు లేకపోతే గ్లాకోమాకు చికిత్స తీసుకోలేమని చాలా మంది భావిస్తుంటారు. గ్లాకోమా నయం కానప్పటికీ.. కంటి చుక్కలు, కొన్ని చికిత్సలతో సహా మందులు దీన్ని తగ్గిస్తాయి. అంధత్వాన్ని నివారించడానికి నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రారంభ స్క్రీనింగ్, కంటివైద్యుల ద్వారా సరైన మందులు అవసరం.

ఎక్కువ స్క్రీన్ సమయం

ఎక్కువ సేపు స్క్రిన్ ను చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది గ్లాకోమా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని సూచించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్లాకోమా కొన్ని సాధారణ లక్షణాలు తీవ్రమైన కంటి నొప్పి, అస్పష్టమైన దృష్టి, ఆకస్మిక దృష్టి అవాంతరాలు, వికారం.

గ్లాకోమాను ఇంటి నివారణలతో చికిత్స చేయొచ్చు

మనలో చాలా మంది సహజ లేదా ఇంటి నివారణలతో గ్లాకోమాను నివారించవచ్చని అనుకుంటారు. కొన్ని సహజ నివారణలు ఇతర ఆరోగ్య సమస్యలకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ అవి గ్లాకోమాను నయం చేస్తాయని సూచించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్లాకోమాకు సరైన చికిత్సకు మందులు, కంటి డాక్టర్ పర్యవేక్షణ అవసరం.

మంచి దృష్టి ఉన్నవారికి గ్లాకోమా ఉండదు

గ్లాకోమాను కూడా సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. మంచి దృష్టి ఉన్నవారు కూడా గ్లాకోమా బారిన పడొచ్చు. కాబట్టి ప్రారంభ దశలో ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.