ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు సంతానోత్పత్తి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే కొన్ని రకాల విటమిన్లను తీసుకుంటే గర్భం దాల్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.   


ఈ రోజుల్లో పురుషులు, స్త్రీలు సంతానలేమి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. జీవనశైలి వల్లే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. రోజువారి ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం వంటి జీవనశైలి అలవాట్ల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. 

గర్భనిరోధకాలను ఉపయోగించకున్నా.. ఒక సంవత్సరం దాటినా గర్భం దాల్చకపోతే పురుషులు వంధ్యత్వ సమస్యను ఎదుర్కొంటున్నట్టే. హార్మోన్ల అసమతుల్యత లేదా పురుష పునరుత్పత్తి అవయవాలలో అంతరాయాలు కూడా వంధ్యత్వానికి కారణమవుతాయి. దాదాపు సగం కేసులలో మగ వంధ్యత్వానికి కారణం తెలియదు. స్పెర్మ్ లేకపోవడం లేదా స్పెర్మ్ నాణ్యత వంటి సమస్యలు వస్తాయి. 

స్పెర్మ్ ఉత్పత్తికి పోషణ కీలక పాత్ర పోషిస్తుంది. అవసరమైన విటమిన్లను తీసుకోవడం వల్ల గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను పెంచడానికి, స్పెర్మ్ చలనశీలతను మెరుగుపర్చడానికి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి సహాయపడతాయి.

ఈ రోజుల్లో చాలా మంది పురుషులు తరచుగా స్పెర్మ్ కౌంట్, అంగస్తంభన లోపం, స్ఖలనం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, ఆల్కహాల్, రసాయనాలు, ధూమపానం, ఊబకాయం, కొన్ని మందులు, అంటువ్యాధులు మగ వంధ్యత్వానికి దారితీస్తాయి. సంతానోత్పత్తి సమస్యలను దూరంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. సంతానలేమి సమస్యను నివారించడానికి ఎలాంటి పోషకాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

విటమిన్ సి

స్పెర్మ్ కౌంట్ తో సహా స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అతి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లలో ఇదీ ఒకటి. విటమిన్ సి స్పెర్మ్ చలనశీలతను పెంచడానికి సహాయపడుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. మిరియాలు, స్ట్రాబెర్రీలు, టమోటాలు, బ్రోకలీ, క్యాబేజీ, బొప్పాయి, నిమ్మ, జామ, కివి, ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలు పురుషులలో సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

విటమిన్ బి12

స్పెర్మ్ ఉత్పత్తిని పెంచేందుకు విటమిన్ బి 12 చాలా అవసరం. ఈ విటమిన్ చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో  పుష్కలంగా ఉంటుంది. 

జింక్

జింక్ టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది. ఈ పోషకం కండరాల పెరుగుదలతో పాటు సంతానోత్పత్తిని పెంచుతుంది. పురుషులు పుట్టగొడుగులు, బచ్చలికూర, గుమ్మడికాయ గింజలు, పెసరపప్పు, కాయధాన్యాలు, పెరుగును తింటే జింక్ బాగా అందుతుంది. 

విటమిన్ డి

విటమిన్ డి పురుషుల మొత్తం సంతానోత్పత్తిని, స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడుతుంది. సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. 

ఫోలేట్

ఫోలేట్ స్పెర్మ్ సంఖ్యను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండు, బీన్స్, వేరుశెనగ, అవోకాడోలు, స్వీట్ కార్న్, సోయాబీన్స్, గింజల్లో ఫోలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

విటమిన్ ఇ

విటమిన్ ఇ పురుషుల స్పెర్మ్ దెబ్బతినకుండా ఉంచడానికి సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, హాజెల్ నట్స్, బచ్చలికూర, బ్రోకలీలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

సెలీనియం

ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి సెలీనియం చాలా అవసరం. సెలీనియం స్థాయి తక్కువగా ఉంటే స్పెర్మ్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్పెర్మ్ ఎక్కువగా ఉండే  సీఫుడ్, అవిసె గింజలను రోజూ తినండి.