హార్ట్ ఎటాక్ కేసులు రోజు రోజుకు వేగంగా పెరిగిపోతున్నాయి. పెద్దలే కాదు చిన్నవయసు వారు కూడా గుండెపోటు, గుండెజబ్బుల బారిన పడుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రస్తుతం సామాన్యుల నుంచి బడా సెలబ్రిటీల వరకు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంతోమంది ఉన్నపాటుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. కేకే, సతీష్ కౌశిక్ వంటివారెందరో గుండెపోటుతో చనిపోతున్నారు. తరుచుగా ఇలాంటి విషాదకరమైన వార్తలు ప్రజల్ని మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి వార్తల వల్ల ప్రజలు గుండె ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు గుండెను ప్రమాదంలో పడేస్తాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఎర్ర మాంసం, గుడ్డు పచ్చసొన, వెన్న, నెయ్యి కూడా గుండె జబ్బులను కలిగిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెరుగుతున్న గుండెపోటు కేసులకు ఆహారమే కారణమని వైద్యులు ఆరోపిస్తున్నారు. మీరు తినే ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలు ఎక్కువగా ఉంటే.. మీ గుండె ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అయితే కొంతమంది నిపుణులు కూడా గుడ్డులోని పచ్చసొన, ఎర్ర మాంసం కూడా గుండెపోటుకు కారణమని భావిస్తారు. ఇంకొంత మంది నిపుణులు దీనిలో వాస్తవం లేదని చెబుతున్నారు. 

అవసరమైన దానికంటే ఎక్కువ గుడ్లు ప్రమాదాన్ని పెంచుతాయి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్లకు, గుండె జబ్బులకు మధ్య సంబంధాన్ని కొన్ని అధ్యయనాలు చూపించాయి. దీనికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. సాధారణంగా చాలా మంది గుడ్లతో తినే ఆహారాలైన బేకన్, సాసేజ్, హామ్ వంటివి గుడ్ల కంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అవసరానికి మించి గుడ్లు తింటే సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గుడ్డు తింటే గుండెపోటు, స్ట్రోక్ లేదా మరే ఇతర రకాల గుండె జబ్బుల ప్రమాదం ఎంత మాత్రం పెరగదు. 

గుడ్లలో కొలెస్ట్రాల్

గుడ్లలో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది కూడా గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. నిజానికి గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.

గుడ్లలో సంతృప్త కొవ్వు 

కానీ మన శరీరంలోని కొలెస్ట్రాల్ లో ఎక్కువ భాగం మన కాలేయం ద్వారానే తయారవుతుందని ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. ఇది మనం తినే కొలెస్ట్రాల్ నుంచి రాదు. కాలేయం ప్రధానంగా మన ఆహారంలో ఉండే సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ను తయారు చేస్తుంది. ఒక గుడ్డులో 1.5 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది.

గుడ్లలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉన్నాయని పరిశోధనలో తేలింది. లుటిన్, జియాక్సంతిన్ కళ్లకు మంచివి. మెదడుకు, నరాలకు కోలిన్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ డి లు కూడా ఉంటాయి.

రోజుకు ఒక గుడ్డు గుండెకు సురక్షితం

హార్వర్డ్ మెడికల్ స్కూల్లో వేలాది మందిని దశాబ్దాలుగా నిరంతరం అనుసరించారు. రోజుకు ఒక గుడ్డు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ లేదా ఇతర గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నట్టు కనుక్కోలేదు. రోజుకు ఒక గుడ్డు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

ఎర్ర మాంసం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది 

గొడ్డు మాంసం, పంది మాంసం వంటి ఎర్ర మాంసం తిన్న తర్వాత గట్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కోలిన్, కార్నిటైన్ వంటి పోషకాలు ఎర్ర మాంసంలో ఉంటాయి. ఈ పోషకాలు గట్ బ్యాక్టీరియా ద్వారా గట్ లోని టిఎంఎఓ (ట్రిమెథైలామైన్-ఎన్-ఆక్సైడ్) గా విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల రక్తంలో టీఎంఏవో స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది హార్డ్ ఆర్టరీ, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.