Alzheimers Risk: అల్జీమర్స్ ముప్పును తగ్గించే ఫుడ్ ఏంటో మీకు తెలుసా?
అల్జీమర్స్ ముప్పును తగ్గించుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం ఈ మతిమరుపుకు మందుగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్జీమర్స్ వ్యాధి గురించి అందరికీ తెలుసు. షార్ట్ గా చెప్పాలంటే ఇదొక రకమైన మతిమరుపు సమస్య. ఓ అధ్యయనం ప్రకారం ఈ వ్యాధి బారిన పడినవారు కుటుంబ సభ్యుల పేర్లను సైతం మరిచిపోతారట. ఈ వ్యాధి వల్ల వ్యక్తుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయట. మతిమరుపు వ్యాధి ముదిరేకొద్దీ ఆలోచనా శక్తి, సమస్యా పరిష్కార సామర్థ్యం తగ్గుతుందట. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల ద్వారా ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉందట. ఇంతకీ ఏ ఆహారం తీసుకుంటే అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్జీమర్స్ ప్రమాదాన్ని వీటితో తగ్గించుకోవచ్చు
మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైన వాటిని చేర్చుకోవడం ద్వారా అల్జీమర్స్ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చని అధ్యాయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, పాలు, పెరుగు, అవిసెలు, బాదం, జీడిపప్పు తదితరాల్లో ఇవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అరటి, తదితర తాజా పండ్లు సైతం మతిమరుపును దూరంగా ఉంచుతాయని చెబుతున్నారు.
వ్యాయామంతో...
మెదడుకు పదునుపెట్టే ఆటలను అలవాటు చేసుకోవడం మంచిది. రోజూ వ్యాయామం చేయడంవల్ల మెదడుకు రక్త సరఫరా పెరిగి, అల్జీమర్స్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు
తినకూడని ఆహార పదార్థాలు
రెడ్ మీట్:
రెడ్ మీట్ లో ఐరన్ ఎక్కువ. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా తినడం వల్ల మెదడులో వయస్సును పెంచే గ్రంథి యాక్టివ్ అవుతుంది.
చక్కెర పదార్థాలు:
పిండి పదార్థాలు, చక్కెర అతిగా తీసుకునేవారికి ఆల్జిమర్స్ వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు అధికమని పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి అలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
నూనే పదార్థాలు:
నూనెలో బాగా వేయించిన ఫుడ్ వల్ల కూడా ఆల్జీమర్స్ ఏర్పడతాయి. వీటిలో ‘బీటా అమైలాయిడ్’ అనే విషతుల్య ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయట. వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
శుద్ధి చేయని కూరగాయలు, పండ్లు తదితర ఆహారాల వల్ల కూడా అల్జీమర్స్ ఏర్పడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. వీటిపై ఉండే పురుగుమందుల అవశేషాల వల్ల మెదడుకు ముప్పు పెరుగుతుంది.

