పాలు, చక్కెర కలిపిన టీ, కాఫీ కంటే బ్లాక్ కాఫీనే ఆరోగ్యానికి ఎక్కువ మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. మంచిది కదా అని ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

చాలా మందికి వేడి వేడి కప్పు కాఫీతో రోజును స్టార్ట్ చేస్తారు. ఉదయం ఒక్కసారేనా.. పని చేసేటప్పుడు మందకొడిగా అనిపించినా ఒక కప్పు కాఫీని తాగుతారు. మీటింగ్స్ కు వెళ్లినప్పుడు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినప్పుడు అంటూ ప్రతిసందర్భానికి టీ లేదా కాఫీని పక్కాగా తాగుతారు. కాఫీ మన శరీరాన్ని ఉత్తేజంగా చేస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. నిద్రమత్తును పోగొడుతుంది. క్యాపుచినో, లాటే లేదా ఫ్రేప్, బ్లాక్ కాఫీ వంటి పానీయాలను ఎక్కువగా తాగుతారు. ప్రపంచంలో ఎక్కువ మంది తాగే ఆహార పానీయాలలో కాఫీ రెండో ప్లేస్ లో ఉంది తెలుసా? పాలు, పంచదార కలిపిన టీ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది బ్లాక్ కాఫీనే తాగుతుంటారు. నిజానికి బ్లాక్ కాఫీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలా అని దీన్ని ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

బ్లాక్ కాఫీలో కూడా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని మోతాదులో తీసుకుంటే శరీరం సానుకూల ప్రభావం పడుతుంది. కానీ ఎక్కువగా తాగితేనే శరీరంలో కెఫిన్ కంటెంట్ ఎక్కువయ్యి ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..?

ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది

బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగితే మీ శరీరంలో కార్డిసాల్ అనే ఒత్తిడిని కలిగించే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది. మీరు ఎక్కువ కెఫిన్ నుు తీసుకుంటే శరీరం వణుకుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. 

నిద్రసరిగ్గా పట్టదు

కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ నిద్రదినచర్య దెబ్బతింటుంది. మీరు రాత్రిళ్లు హాయిగా నిద్రపోవాలంటే మాత్రం సాయంత్రం 6 గంటల తర్వాత కాఫీని తాగడం మానుకోండి. కాఫీ మన మైండ్ ను చురుగ్గా మారుస్తుంది. దీంతో మీరు ఏం చేసినా నిద్రపోలేరు.

ఎసిడిటీ

బ్లాక్ కాఫీలో కెఫిన్ కంటెంట్ తో పాటుగా యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తాగితే ఎసిడిటీ సమస్య వస్తుంది. తిమ్మిరి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

మీ శరీరం పోషకాలను గ్రహించలేదు

మీ శరీరంలో కెఫిన్ కంటెంట్ ఎక్కువైతే మీరు తినే రోజువారీ ఆహారం నుంచి ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలను గ్రహించడం మీ శరీరానికి కష్టంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తులు రోజుకు 400 మి.గ్రాకు మించి ఎక్కువగా కెఫిన్ ను తీసుకోకూడదు. అంటే ఇది సుమారుగా 4 కప్పులు (960 మి.లీ) కాఫీకి సమానం. ఇంతకు మించి ఎక్కువ కాఫీని తాగకూడదు.