అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మాజీ  సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడుపై ఫైర్ అయ్యారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారని ధర్మాన గుర్తుచేశారు.  రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రజా సమస్యలను, అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారని... వాటిని దృష్టిలో వుంచుకునే ఇప్పుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అరుదైన తీర్పును ప్రజలు వైయస్ జగన్ కు ఇచ్చారని... అలాంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకోవడం ఏంటని ధర్మాన మండిపడ్డారు. 

పార్లమెంట్ ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని ధర్మాన తెలిపారు. బ్రిటీషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెద్దల సభను ఏర్పాటు చేశారని... గతంలోనే జాతిపిత మహాత్మా గాంధీజీ కూడా ఈ పెద్దల సభలను వ్యతిరేకంచారని గుర్తుచేశారు. మండలి అవసరం లేదని గతంలో చంద్రబాబే అన్నారని... మళ్ళీ ఈరోజు దానిపై యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని వారికి రాజకీయ పునరావాసం కోసమే మండలి ఉపయోగపడుతుందని ధర్మాన ఎద్దేవా చేశారు. 

read more  శాసన మండలిపై చంద్రబాబు యూటర్న్ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన

రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యం చేయడం కోసం మండలిని ఈరోజు చంద్రబాబు వినియోగిస్తున్నారని మండిపడ్డారు.మండలి  వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని గతంలో చంద్రబాబే అన్నారుని గుర్తుచేశారు. రూ.5 కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ రాజకీయాల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ,పేదలకు ఇంగ్లీష్ విద్య, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ చట్టాలు ఆలస్యమవుతున్నాయని అన్నారు. 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా పెద్దల సభలు తాత్కాలికమే అన్నారని పేర్కొన్నారు. చట్ట సవరణలు చేసుకునే అధికారం శాసనసభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు?అని ప్రశ్నించారు. 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండలి ఉందని  తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే... మండలిలో మాత్రం ఆయన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారని... ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడం కాదా అంటూ ధర్మాన మండిపడ్డారు.  

1971,1972,1975 లలో రాజ్యసభ రద్దుకు కూడా ప్రయత్నాలు జరిగాయని ధర్మాన గుర్తుచేశారు. మండలి గురించి గతంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు నేడు మాటమార్చారని... అందువల్ల సభకు మొహం చూపించలేకే  ఆయన ఈరోజు అసెంబ్లీకి రాలేదని అన్నారు. మండలి అవసరం లేదని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే శాసన సభకు రాలేదన్నారు.  40ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు గతంలో తీర్మానం కూడా పెట్టారు... ఆ తీర్మానంలో ఉన్నవన్నీ తప్పులేనని ధర్మాన విమర్శించారు.  

read more  జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు

సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉందని దాన్ని శాసనమండలిలో ఎన్నిరోజులు చర్చించారు? దాన్ని సెలక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు..? అని ధర్మాన ప్రశ్నించారు. కేవలం 12 పేజీలున్న వికేంద్రీకరణ బిల్లు మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపించారని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానాన్ని సమర్థిస్తూ సీఎం జగన్ ప్రజల కోసం ధైర్యంగా ముందుకెళుతున్నారని.... ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ధర్మాన తెలిపారు.