శాసన మండలిపై చంద్రబాబు యూటర్న్ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన
శాసనమండలి రద్దు విషయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగం వీడియో క్లిప్పింగ్ ను సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రదర్శించారు.
అమరావతి: శాసనమండలిని వ్యతిరేకిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్ర శాసనసభలో ప్రసంగాన్ని సోమవారం నాడు అసెంబ్లీలో ప్రదర్శించారు. ఏపీ మంత్రి పేర్నినాని తన ప్రసంగం సమయంలో ఈ వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు.
Also read:జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు
ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మంత్రి పేర్నినాని ప్రసంగించారు. శాసనమండలి రద్దును టీడీపీ చీఫ్ చంద్రబాబునాయడుు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయాన్ని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ప్రతి విషయంలో యూ టర్న్ తీసుకొన్నారని చంద్రబాబుపై పేర్నినాని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో శాసనమండలి పునరుద్దరణ విషయమై జరిగిన చర్చలో అప్పటి విపక్షనేత చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగం క్లిప్పింగ్‌ను స్పీకర్ అనుమతితో పేర్నినాని శాసనసభలో ప్రదర్శించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర శాసనసభలో శాసనమండలిని పునరుద్దరించకూడదని కోరుతూ చంద్రబాబునాయుడు ప్రసంగించారు. తమ పార్టీకి చెందిన కొందరు సభ్యులకు పదవులు కట్టబెట్టేందుకు గాను కాంగ్రెస్ పార్టీ శాసనమండలిని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆ సమయంలో చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
శాసనమండలి వల్ల బిల్లులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో పెద్దల సభ లేని విషయాన్ని చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఎగువ సభ అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించిన అంశాలను చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు.
ఈ వీడియో క్లిప్పింగ్ తర్వాత యూటర్న్ లు తీసుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండరన్నారు. ఒక్క విషయంపై ఒక్క మాట మాట్లాడి అదే విషయమై మాట మార్చే తత్వం చంద్రబాబుకే దక్కుతోందన్నారు.