అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియ కనీసం రెండేళ్ల పాటు  కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కేంద్రంలో ఉన్న ప్రభుత్వంపై కూడ  ఈ ప్రక్రియ ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది. మరో వైపు సెలెక్ట్ కమిటీ తన పనికి ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకం కల్గించబోదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.

Also read:ఏపీ శాసనమండలి రద్దు: అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్

ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.అదే తీర్మానాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రవేశపెట్టారు.  ఏపీ శాసనమండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం  కేంద్రానికి పంపనున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న  సమయంలో 1985 మే 31వ తేదీన శాసనమండలిని రద్దు చేశారు. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 2007 మార్చి 30వ తేదీన శాసనమండిని పునరుద్దరించారు.  శాసనమండలి పునరుద్దరణను పురస్కరించుకొని 2007 ఏప్రిల్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రసంగించారు.

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ  రద్దు బిల్లులను ఏపీ శాసనమండలి  సెలెక్ట్ కమిటీకి పంపింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు పేర్లను పంపాలని  కోరుతూ  శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ఈ నెల 26వ తేదీన ఆయా పార్టీలకు లేఖ రాశారు. 

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ  పలు సూచనలు, సలహాలను ఇవ్వనుంది. శాసనమండలిలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన ఇద్దరు మంత్రులు ప్రతి కమిటీకి ఛైర్మెన్‌గా ఉంటారు. ప్రతి కమిటీలో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు.

ప్రతి కమిటీలో శాసనమండలిలో ఆయా పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి  సభ్యులు ఉంటారు. టీడీపీకి ఐదుగురు, వైసీపీ, బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులకు ఒక్క సభ్యుడు ఉంటారు.  

రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారంగా శాసనమండలి రద్దు లేదా పునరుద్దరణ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏపీ అసెంబ్లీ పంపే ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

పార్లమెంట్‌లో శాసనమండలి రద్దు తీర్మానంపై 2/3 వంతు సభ్యులు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత  రాష్ట్రపతి గెజిట్ విడుదల చేస్తే శాసనమండలి రద్దు ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది నుండి రెండేళ్ల పాటు సమయం పట్టే అవకాశం ఉందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.

అయితే అప్పటివరకు సెలెక్ట్ కమిటీ తన పని కొనసాగిస్తోందని యనమల రామకృష్ణుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఉన్న సంబంధాలను బట్టి ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే అంతా ఆషామాషీ కాదని టీడీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.  ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ, జనసేన చేతులు కలిపింది.

ఈ రెండు పార్టీలు సార్వత్రిక ఎన్నికల వరకు పొత్తులు ఉంటాయని ఈ రెండు పార్టీలు ప్రకటించాయి.ఏపీలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్‌తో కమలదళం చేతులు కలిపింది.

శాసనమండలి నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. శాసనమండలి రద్దైతే వీరిద్దరూ కూడ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది.

శాసనమండలి సాంకేతికంగా రద్దయ్యే వరకు సెలెక్ట్ కమిటీ తన పని చేసుకొంటూ పోతోందనే అభిప్రాయాలను టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు.