గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  మూడు రాజధానులు ఏర్పాటు కోసం తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో తాము వ్యతిరేకించలేదని మండలి టిడిపి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేవలం తాము బిల్లును సెలెక్ట్ కమిటీకి మాత్రమే పంపిచామన్న విషయం ప్రభుత్వం, వైఎస్సార్  కాంగ్రెస్ నాయకులు గుర్తించి ఈ విషయంపై మాట్లాడితే మంచిదని సూచించారు. 

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా శాసనసభలో ఆమోదించిన బిల్లులకు కౌన్సిల్ ఎందుకు మద్దతు తెలపాలి..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా సెలక్ట్ కమిటీ కోసం ప్రతిపక్షాలు సూచించిన పేర్లు తీసుకునేందుకు లెజిస్లేటివ్ సెక్రటరీ వెనకాడుతున్నారని అన్నారు. 

read more  ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలపై కేంద్ర సంస్థతో దర్యాప్తు: ఆ 7 అభియోగాలు ఇవే

మండలి చైర్మన్ తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని యనమల సూచించారు. మండలి చైర్మన్ మీద ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చే అధికారం అధికార పార్టీ ఎమ్మెల్సీలు, మంత్రులకు లేదన్నారు. లెజిస్లేటివ్ సెక్రటరీ, మంత్రుల మీద కంటెమ్ట్ ఆఫ్ ద హౌజ్ నోటీస్ ఇస్తామని యనమల హెచ్చరించారు. 

వైసీపీ ప్రభుత్వానికి అసెంబ్లీ నియమ, నిబంధనలు తెలియవన్నారు. అధికార పార్టీ మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్ష పార్టీలను కలుపుకుని జరుగుతున్న పరిణామాలను గవర్నర్ ను కలిసి వివరిస్తామని... ఈ విషయంలో కలగజేసుకోవాలని కోరనున్నట్లు యనమల వెల్లడించారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. వికేంద్రీకణ బిల్లులపై గవర్నర్ ఆర్డినెన్స్ తెచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.. సీఎం జగన్ పాలనలో ఏపీ కుప్పకూలుతోందని అన్నారు. 

read more   కుట్రలు చేస్తే ఈసారి 23 సీట్లు కూడా రావు: బాబుకు అవంతి చురకలు

ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వ అధికారులపై కక్షసాధింపు చర్యలు సరికాదన్నారు. అలాగే  అధికారులు కూడా ఎవ్వరికీ అనుకూలంగా కాకుండా ప్రభుత్వ  నిబంధనలకు లోబడే పనిచేయాలని సూచించారు. అలా కాదని  వైఎస్ హయాంలో కేవలం కొందరి ప్రయోజనాల కోసం పనిచేసిన అధికారులు కోర్టులపాలయిన విషయం ప్రతిఒక్కరు గుర్తుంచేకోవాలని యనమల సూచించారు.