విజయవాడ: వైసీపీ ఆరునెలల పాలనలో రాష్ట్రాభివృద్దికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి, టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా పగ్గాలను చేతబట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడపడంలో విఫలమయ్యారని అన్నారు. వైసిపి ఆరునెలల పాలనను ఎండగడుతూ ప్రచురించిన బుక్ ను యనమల విడుదల చేశారు. 

జగన్ ప్రభుత్వం ఆరునెలల హింసాత్మక పరిపాలన గురించి ఈ పుస్తకంలో వివరించినట్లు యనమల వెల్లడించారు. జగన్ మంచి సిఎం కాదు, జనాన్ని ముంచే సిఎం అని ఎద్దేవా చేశారు. వైసిపి ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాల హామీలను అమలుపర్చడంలో విఫలమయ్యిందన్నారు. 

read more  అమరావతిపై చంద్రబాబు ఆలోచన అది... జగన్ ది మాత్రం...: అనురాధ

వైసిపి ఆరునెలల పాలనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికన స్పందించారు. '' కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టింది. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం''
 
''6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది?''   

''వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి నన్నే ఆరోపిస్తున్నారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి. అంతేకాని అహంకారంతో  ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా?'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 

read more   రాజ్యాంగం మీద ప్రమాణంచేసి బూతుల పంచాంగమా...?: మంత్రులపై వర్ల రామయ్య ఫైర్
 
ఇక టిడిపి మహిళా  నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా జగన్ ఆరునెలల పాలనపై విరుచుకుపడ్డారు. ''జగన్ గారి ఆరు నెలల పాలన మీద ప్రపంచం ఏమంటాది ? .. పెద్ద చెప్పుకోడానికి ఎం లేదు .. చెప్పు తీసుకుని కొట్టుకోడం తప్ప'' అంటూ ట్వీట్ చేశారు.