అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఐదు కోట్ల ఆంధ్రుల కోసం టిడిపి అధినేత చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి  పంచుమర్తి అనురాధ తెలిపారు. అందులోభాగంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాలకు ధీటుగా అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. 

ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని ప్రాంత రైతులు ఏకంగా 33వేల ఎకరాలను అందించారన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం జరిగితే ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందనే దుగ్ధతో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని నిర్మాణాన్ని అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజా రాజధానిని శ్మశానంతో పోల్చినప్పుడే రాజధానిపై వైసిపి వైఖరి తేటతెల్లమైందన్నారు. రాజధాని శ్మశానం అయితే వైసిపి ప్రభుత్వం ఎక్కడి నుంచి పాలన చేస్తోంది? అని ప్రశ్నించారు. 

read more  రివర్స్ టెండరింగ్...చంద్రబాబు, లోకేశ్ ల భారీ దోపిడీకి అడ్డుకట్ట: బొత్సా

టీడీపీ హయాంలో ఎన్నో నిర్మాణాలు ప్రారంభిండమే కాదు పూర్తిచేయడం కూడా జరిగిందన్నారు. రాజధానిలో సుమారు 40వేల కోట్ల విలువైన పనులు జరుగుతుండగా... వైసీపీ ప్రభుత్వం అన్నింటిని రద్దు చేసి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరగకపోతే చంద్రబాబు పర్యటన చేపడితే ఎందుకంత భయపడ్డారని నిలదీశారు. చంద్రబాబు గారి పర్యటన నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం నానా అగచాట్లు పడిందన్నారు. 

చంద్రబాబు పర్యటన వల్ల రాజధానిపై వైసిపి చేస్తున్న కుట్రలు ఎక్కడ ప్రజలకు తెలుస్తాయనే భయంతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషిచేశారని ప్రశంసించారు.

read more  వైసిపి కుట్రలు... చంద్రబాబు వాహనంపై దాడికి ముందే ప్రణాళిక..: సోమిరెడ్డి

 జగన్‌ విధ్వంసక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని.... రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో తలలేని మొండెంలా రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు.  వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని... రద్దులు, రివర్స్‌లతో రాష్ట్రం అంధకారమైందన్నారు. 

జే ట్యాక్స్‌ వసూలు చేస్తూ పారిశ్రామికవేత్తలను జగన్‌ భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న వైసిపికి రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అనురాధ హెచ్చరించారు.