గుంటూరు: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ గారు ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుకకొరతతో ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆయన గుంటూరులో నిరసన దీక్ష చేపట్టారు.  

భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇసుక తింటున్నారని ఆరోపించారు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1400 నుండి రూ.1800 ఉంటే వైకాపా నేతలు అనేక ఆరోపణలు చేసారని...ఇప్పుడు జగన్  హయాంలో ట్రాక్టర్ ఇసుక  రూ.4 వేల నుండి రూ.6 వేలు అమ్ముతున్నారని అన్నారు. ఇదే సీఎంగారి రివర్స్ టెండరింగ్ అంటే అని వివరించారు. 

read more Nara lokesh video : ఇసుక కొరతపై ఒక్కరోజు దీక్షలో నారాలోకేష్

ఇసుకను తింటున్న పందికోక్కులపై చర్యలు తీసుకొని సామాన్యులను కాపాడాలని లోకేష్ కోరారు. ప్రపంచంలో ఇసుకని కేజీల్లో అమ్ముతున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమేనని..ఇసుక కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఒక మాయలా వుందన్నారు.

ఇసుక ఆన్ లైన్ అమ్మకాల కోసం పనిచేస్తున్న వెబ్‌సైట్  లో సామాన్యులకు ఎప్పుడూ నో స్టాక్ అనే వస్తుందన్నారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని మంత్రులు అంటున్నారు... మరి ఇదే  ఇసుక బెంగుళూరు,చెన్నై,హైదరాబాద్ ఎలా వెళ్తోందని ప్రశ్నించారు. 

తాను తిన్నది అరగక దీక్ష చేస్తున్నానని కొందరు మంత్రులు అంటున్నారని లోకేష్ గుర్తుచేశారు. తనను ఎన్ని మాటలన్నా పడతానని... కానీ భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు.

read more  ఇసుక కొరత: గుంటూరు కలెక్టరేట్ ముందు నారా లోకేష్ దీక్ష

ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి అని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారని... కానీ రాజధాని సాక్షిగా ఓ ఎమ్మెల్యే, ఎంపీ వీధి రౌడిల్లా కొట్టుకున్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఆ పంచాయతీ ముఖ్యమంత్రే తీర్చారు గుర్తులేదా? అని అన్నారు. నెల్లూరు ఎమ్మెల్యేను ఇసుక దందా ఆపాలని లేఖ రాసిన విషయాన్ని మరిచారా...? అని ప్రశ్నించారు.

ఇసుక కోరితే లేకపోతే ఇసుక వారోత్సవాలు ఎందుకో ముఖ్యమంత్రి జగన్ చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 

read more ఇసుకపై టీడీపీ పోరాటం: గుంటూరులో లోకేష్ నిరసన దీక్ష

ఒక్క గుంటూరు లొనే ఐదుగురు కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని...వెంటనే ఉచిత ఇసుక విధానం తీసుకురావాలి డిమాండ్ చేశారు.

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వలన నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకి రూ.10 వేల చొప్పున ఐదు నెలలకు గాను రూ.50 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.