జగన్ వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అన్యాయం: నిమ్మల రామానాయుడు

ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ ను నిర్ణయించే పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.  

tdp mla nimmala ramanaidu comments  on polavaram project

గుంటూరు: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం ఆలస్యం చేయడంవల్ల యావత్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధే నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని టీడీపీఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రివర్స్‌ టెండర్ల పేరుతో రిజర్వ్‌ టెండర్లకు పాల్పడి రూ.780కోట్లు ఆదాచేశామంటున్న ప్రభుత్వం, అంతకు పదింతలనష్టాన్ని రాష్ట్రంపై మోపిందన్నారు. 30వ తేదీన పోలవరాన్ని సందర్శించిన కేంద్ర నిపుణుల బృందం ప్రాజెక్ట్‌ పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచిందని నిమ్మల చెప్పారు. ఈ ఏడునెలల్లో జరిగిన పనులను చూస్తుంటే, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేమని బృందసభ్యులు చెప్పడం జరిగిందన్నారు. 

ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని  నిమ్మల డిమాండ్‌ చేశారు. పోలవరం ఆవశ్యకతను గుర్తించిన చంద్రబాబు తన పరిపాలనలో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి 71శాతానికి పైగా పూర్తిచేశారన్నా రు. 2004 నుంచి 2014వరకు కేవలం 7శాతం మాత్రమే పనులు జరిగాయన్నారు.  

ప్రాజెక్ట్‌ని పూర్తిచేయాలన్న చిత్తశుద్ధితోనే ప్రతి సోమవారం సమీక్ష జరుపుతూ పోలవరం పనుల్ని చంద్రబాబు పరుగులు పెట్టించాడన్నారు. కేవలం 24 గంటల్లోనే 32,350 క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌పని చేయించి గిన్నిస్‌ రికార్డులు నెలకొల్పిన ఘనత చంద్రబాబుకే దక్కిందని రామానాయుడు పేర్కొన్నారు.చంద్రబాబు హయాంలో పనులతీరుని చూసిన ఆనాటి కేంద్రజలవనరులమంత్రి నితిన్‌గడ్కరీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, దేశంలో మొత్తం 16 జాతీయప్రాజెక్టులుంటే పోలవరం మాత్రమే వేగంగా నిర్మితమవుతోందని చెప్పారన్నారు. 

read more నూతన సంవత్సర వేడుకలకు చంద్రబాబు దూరం...ఎందుకంటే

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం పనులుచూస్తుంటే గిన్నిస్‌వారు కూడా తలదించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.91లక్షల హెక్టార్లకు సాగునీరందించడానికి 960 మెగావాట్ల విద్యుదుత్పత్తికి, విశాఖకు తాగు మరియు పరిశ్రమల అవసరాలకోసం 23.44టీఎంసీల నీరందించడానికి, 84.70టీఎంసీలు కృష్ణాబేసిన్‌కి అందించడానికి డిసెంబర్‌ 2019 నాటికి పోలవరాన్ని పూర్తిచేయడానికి సహకరిస్తామని నితిన్‌గడ్కరీ తానిచ్చిన నివేదికలో పేర్కొన్నారని రామానాయుడు వివరించారు. 

చంద్రబాబు హయాంలో జరిగిన పనితీరుని చూసి ఆనాటి కేంద్రమంత్రి అలా చెప్పడం జరిగిందన్నారు. తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రబృందం పనులు తీరుని చూసి ముక్కునవేలేసుకుందన్నారు.  2021 డిసెంబర్‌కి ప్రాజెక్ట్‌ని పూర్తిచేస్తామన్న జగన్‌వ్యాఖ్యలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అరబస్తా సిమెంట్‌ కూడా వాడలేదని కేంద్రబృందమే వాపోయిందన్నారు.    

స్పిల్‌వేగేట్ల అమరిక, కాపర్‌డ్యామ్‌, మెయిన్‌డ్యామ్‌ పనులు నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తికావని 2020 జూలైకి స్పిల్‌వే నిర్మాణం జరగదని నిపుణులు చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రప్రభుత్వ వైఖరి కారణంగా స్పిల్‌వే గేట్ల తయారీ, బిగింపు బాధ్యతలు తీసుకున్న బెకమ్‌ కంపెనీ కూడాపనులు నిలిపివేసిందన్నారు. రిజర్వ్‌ టెండర్లవల్లే ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయన్నారు. 

రాష్ట్రానికి చెందిన అధికారులు కూడా కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్ట్‌ పనులు చేస్తామని చెప్పడం చూస్తుంటే జగన్‌ ప్రభుత్వానికి పోలవరం నిర్మాణంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు.  రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం సకాలంలో నిధులివ్వకపోయినా రాష్ట్ర ఖజానా నుంచే రూ.5వేలకోట్లను చంద్రబాబు పోలవరానికి ఖర్చుచేశాడన్నారు. అనుభవం లేని సంస్థకు పోలవరం పనులు అప్పగించడం వల్లే నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయని, ప్రాజెక్ట్‌ భద్రతకూడా ప్రశ్నార్థకం కానుందని రామానాయుడు వాపోయారు. 

read more  రాజధానిగా అమరావతికున్న చట్టబద్దత ఇదే...: ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రూ.780కోట్లు ఆదాచేశామంటున్న ప్రభుత్వం, హైడల్‌పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆలస్యం చేయడంద్వారా, మెగాసంస్థకు పవర్‌ప్లాంట్‌ని అప్పగించడం ద్వారా, 2024వరకు సమయాన్ని పొడిగించడంవల్ల 15వేల మిలియన్‌యూనిట్ల విద్యుత్‌ని రాష్ట్రం కోల్పోయిందన్నారు. యూనిట్‌ రూపాయికి లభించే హైడల్‌విద్యుత్‌ని కోల్పోవడం వల్ల, రూ.5కు కొనడంవల్ల, రూ.6వేలకోట్లవరకు రాష్ట్రఖజానాపై భారం పడిందన్నారు. ఎన్నిఏళ్లపాటు హైడల్‌ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైతే, రాష్ట్రానికి అంత నష్టమని నిమ్మలతెలిపారు. 

ఇసుకధరలు పెరగడంవల్ల నష్టమొస్తుందని మెగా సంస్థ విజ్ఞప్తి చేయడంతో రూ.500కోట్లు చెల్లించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రాజెక్ట్‌ పూర్తయ్యేసమయానికి ఇలా ఎన్నివేలకోట్లు నష్టపోవాల్సి వస్తుందో ప్రజలంతా ఆలోచించాలన్నారు. ప్రాజెక్ట్‌ సకాలంలో పూర్తికాకుంటే, 7లక్షల50వేల ఎకరాల్లో పంటలు కోల్పోయే ప్రమాదం  ఉందన్నారు. 

పురుషోత్తమపట్నం, పట్టిసీమ పంపులను నడపడం వల్ల కేవలం విద్యుత్‌కే ఏడాదికి రూ.300కోట్లు ఖర్చుచేయాల్సి  ఉంటుందన్నారు. ఈ విధంగా రాష్ట్రప్రభుత్వం పోలవరం నిర్మాణంలో చేసే ఆలస్యం వల్ల రాష్ట్రప్రజలకు తీరనినష్టం మిగులుతుందేతప్ప, ఏవిధమైన ఉపయోగం ఉండదన్నా రు. 

పోలవరాన్ని సకాలంలో పూర్తిచేసుంటే, అటు విశాఖకు తాగునీరు, పరిశ్రమలకు 23.44 టీఎంసీల నీళ్లు అందేవన్నారు. అలానే గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి రాయలసీమకు గోదావరి నీళ్లు పారేవన్నారు. జగన్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలవల్లే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ నీటిఎద్దడితో నష్టపోనున్నాయని రామానాయుడు తేల్చిచెప్పారు.      
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios