గుంటూరు: తమ రాజధానిని రక్షించుకోవాలని, రాష్ట్రాభివృద్ధిని కాపాడుకోవాలన్న నినాదంతో అన్ని వర్గాల ప్రజలు గత 14రోజులనుంచి వివిధరూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. కొందరు రోడ్లపైకి వస్తుంటే మరికొందరు లోలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ తెలిపారు. 

మంగళవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలో ఎవరిలోనూ నూతన సంవత్సరం వస్తుందన్న సంతోష ఛాయలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన అస్తవ్యస్త విధానాలతో చెలగాటమాడుతూ, ప్రజల జీవితాలను రోడ్డున పడేసిందన్నారు. 

ప్రభుత్వం వచ్చినప్పటీ నుంచీ ప్రజలకు సమస్యలే మిగిలాయని, అన్నక్యాంటీన్ల మూసివేత, ఇసుకకొరత, నిత్యావసరాలు, ఉల్లిధరల పెరుగుదల వంటివాటితో సతమతమవుతున్న ప్రజలపై  జగన్‌ ప్రభుత్వం రాజధాని మార్పు పేరుతో పిడుగు పడేసిందన్నారు. జగన్‌ అసెంబ్లీలో  చేసిన మూడు రాజధానుల ప్రకటన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందని, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాలమధ్య చిచ్చురేపడమే ఆ ప్రకటనలోని ముఖ్య ఉద్దేశమన్నారు.

ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌-2014 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోద ముద్రతో గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా 02-06-2014న చేసిన చట్టంప్రకారం కొత్తరాష్ట్రం ఏర్పడిందన్నారు. రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌-6ప్రకారం ఒక నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని దానిప్రకారం ఒక రాజధాని నిర్మాణానికి ఏపీప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొనడం జరిగిందన్నారు. 

read more  పవన్ నిజంగానే తిక్కలోడు...: వైసిపి ఎమ్మెల్యే ఘాటు విమర్శలు

అందులో భాగంగానే శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని, దాన్ని అధ్యయనం చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యన రాజధానిని ఎంపిక చేసిందన్నారు. యాక్ట్‌లోని సెక్షన్‌-94.3 ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి, మౌలికవసతులు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేంద్రం ఇవ్వాల్సి ఉండగా, కేంద్రప్రభుత్వం రూ.1500కోట్లు ఇచ్చిందన్నారు.

 ఆ తరువాతే రాజధాని నిర్మాణానికి శంఖుస్థాపన జరిగిందని, అనంతరం చంద్రబాబు నాయుడు రైతులనుంచి భూములు సేకరించి, రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడం జరిగిందన్నారు. 

అనంతరం హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీలతో పాటుగా వివిధ భవనాలను నిర్మించడం జరిగిందని కనకమేడల వివరించారు.  ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై రాజధాని మార్పంటూ బాంబు వేసిందన్నారు. గత ప్రభుత్వ విధానాలను తిరగదోడుతూ, కక్ష్యసాధించడం కోసం రాజకీయంగా ప్రతిపక్షాలను అణగదొక్కడమనే లక్ష్యంతోనే జగన్‌ ప్రభుత్వపాలన  కొనసాగుతోందన్నారు. 

గత ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై పున:సమీక్ష కోసం 26-06-2019న జీవోఆర్టీ 1411ప్రకారం కేబినెట్‌ సబ్‌కమిటీని జగన్‌సర్కారు నియమించిందన్నారు. ఆ తరువాత పీటర్‌కమిటీని తరువాత 13-09-2019న జీ.ఎన్‌.రావు కమిటీని వేసిందన్నారు. జీ.ఎన్‌.రావు కమిటీ నియమ నిబంధనలు పరిశీలిస్తే కేపిటల్‌ మార్చాలనిగానీ ఏ ప్రాంతంలో కేపిటల్‌ ఏర్పాటు చేయాలన్న విషయంగానీ కమిటీ విధివిధానాల్లో పొందుపరచలేదన్నారు. 

రాజధాని తరలింపు అనేది జీ.ఎన్‌.రావు కమిటీ పరిధిలో లేని అంశమని ముఖ్యమంత్రి సూచించిన విధంగా 5కోట్లమంది జీవితాలతో చెలగాటమాడేలా ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆ తరువాతే రాష్ట్రంలో ప్రకంపనలు రేగాయని రవీంద్రకుమార్‌  వివరించారు. జీఎన్‌.రావు నివేదిక తర్వాత, కేబినెట్‌ల్లో చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం బోస్టన్‌ కమిటీని తెరపైకి తీసుకొచ్చిందన్నారు. 

read more  2020లో ఏపి ప్రభుత్వం ఏం చేయనుందంటే: సీఎం జగన్

జీ.ఎన్‌.రావు కమిటీకి ఉన్నచట్టబద్ధత ఏమిటో, దాన్ని ఎందుకు వేశారో ఇప్పటివరకు స్పష్టంచేయలేదన్నారు. 29-12-2019న జీవోఎం.ఎస్‌.నెం 159పేరుతో   హైపవర్‌ కమిటీని నియమించడం జరిగిందన్నారు. రీఆర్గనైజేషన్‌ కమిటీలోని నిబంధనలు అనుసరించి హైపవర్‌కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందని, దీనిలో అధికారపార్టీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు ఉన్నారని, అదేమంత్రులు తిరిగి పూటకోరకంగా వ్యక్తిగత ప్రకటనలపేరుతో ప్రజల్ని మరింత గందరగోళపరుస్తున్నారని   టీడీపీ ఎంపీ స్పష్టంచేశారు. 

హైపవర్‌ కమిటీ సమావేశం జరగకుండానే కమిటీలోని సభ్యులందరూ రోజుకో ప్రకటన ఎలా చేస్తారన్నారు. ఏ కమిటీ అయినా రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌కు లోబడే పనిచేయాలి..
 ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌కి లోబడి నిర్ణయాలు తీసుకోవాలా లేక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలా అని పరిశీలిస్తే ఏ ప్రభుత్వం లేదా వ్యక్తులు వేసే ఏ కమిటీ అయినా సరే రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ పరిధికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని కనకమేడల తేల్చిచెప్పారు. 

యాక్ట్‌ చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదన్నారు. దీనిప్రకారం చూస్తే రాజధాని తరలింపు అనేది జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరిధిలో లేదని మూడు రాజధానులు నిర్మించే అవకాశం కూడా వారి పరిధిలో ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ప్రకారం ఒకేఒక్కసారి కేంద్రం ఆమోదంతో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాజధానిని ఏర్పాటు చేసిందన్నారు.  

తదనంతరం అమరావతికి ప్రధాని శంఖుస్థాపన చేయడం  5ఏళ్ల పాలనలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు అవన్నీ కాదని రాజధానిని మారుస్తామంటే చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అది సాధ్యం కాదని రవీంద్రకుమార్‌  పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు తమ ప్రకటనల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. 

రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌-30ప్రకారం హైకోర్టుని తరలించడం వీలుపడదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారమే 01-01-2019న హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేయడమైందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తానన్న జగన్‌ ప్రకటన కూడా మోసపూరితమైందని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అని చెప్పడం కూడా అలాంటిదేనన్నారు. 

రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ప్రకారం ఎన్నికమిటీలు చెప్పినా హైకోర్టుని తరలించడం, రాజధానిని మార్చడం అసాధ్యమని, అలా తరలించడం ఎవరితరం కాదని కనకమేడల తేల్చిచెప్పారు. ఈవిషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసునని చట్టాలను చేతుల్లోకి తీసుకొని చుట్టాలుగా మార్చుకోవడం పాలకులకు అలవాటైంది కనుక తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలన్న తాపత్రయంతో నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నారన్నారు. 

ప్రజలఉద్యమాలు, ఆందోళనలు చూసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలియచేయాలని మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.