అమరావతిలో ఒక్క ఇటుక కూడా లేదని మంత్రి బొత్స ఒక జోకర్‌గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. రాజధాని ప్రాంతం రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాలను బుధవారం టీడీపీ నేతల బృందం పరిశీలించింది.

అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. శాసనసభ్యులకు 280 ఫ్లాట్లు సిద్ధమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటికంటే ప్రభుత్వ నిర్మాణాలే క్వాలిటీగా ఉన్నాయన్నారు. 60 రోజుల్లో పూర్తి అయ్యే నిర్మాణాలను నిలిపివేశారని.. శాడిస్ట్ ఆలోచనతో నిర్మాణాలు ఆపేశారంటూ అచ్చెన్న ఫైరయ్యారు.

రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి బొత్స లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొత్స కార్ పెడితే కలిసి తిరుగుదామని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 9 వేల కోట్లు ఖర్చు ఐతే 30 వేల కోట్ల అక్రమాలు అంటారా.. అమరావతి లో అవినీతి అన్నారు, ఏం తేల్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Also Read:రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం: అమరావతిపై నీలినీడలు

వైసీపీ శాసన సభ్యులు నిర్మాణాల పూర్తి కి పట్టుపట్టాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరు చెపితే చంద్రబాబు గుర్తు వస్తారని నిర్మాణాలు ఆపేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

దేశ పటం లో అమరావతి పేరు లేనందుకు ఈ ప్రభుత్వం సిగ్గు పడాలని.. 5 నెలల్లో రాజధానిలో ఏమి చేశారని ఆయన నిలదీశారు. అమరావతి గ్రాఫిక్స్ అన్నవాళ్ళు ఈ నిర్మాణాలకు ఏమి చెపుతారంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

కాగా గత నెలలో అమరావతి విషయంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియంను తప్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30న జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకున్న ఒప్పందంపై చర్చ జరిగింది. 

Also Read:మ్యాప్‌లో అమరావతి గల్లంతు: చంద్రబాబు సరే, ఆరు నెలల జగన్ వైఖరి వల్లనే సందేహాలు

రాజధాని అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా జన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులను నిలిపివేసింది. చిన్న చిన్న పనులు మినహా మిగిలిన పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పనుల్లో చలనం లేకుండా పోయింది. 

ఏపీలో రాజధానిపై రాజకీయంగా రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని పదేపదే తెలిపింది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటనలు కూడా చేసిన సంగతి తెలిసిందే.  

అమరావతి స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ కన్నా సింగపూర్ సంస్థలకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని జగన్ భావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేబినెట్ లో తీర్మానించారు.