రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం: అమరావతిపై నీలినీడలు
రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రాజధానిపై గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియంను తప్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉంటుందా...?లేక రాజధాని తరలిపోతుందా...? అన్న సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రాజధానిపై గందరగోళానికి గురవుతున్నారు.
ఇలాంటి తరుణంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్సార్టియంను తప్పించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30న జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో కుదుర్చుకున్న ఒప్పందంపై చర్చ జరిగింది.
రాజధాని అమరావతి స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా జన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.
ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులను నిలిపివేసింది. చిన్న చిన్న పనులు మినహా మిగిలిన పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పనుల్లో చలనం లేకుండా పోయింది.
ఏపీలో రాజధానిపై రాజకీయంగా రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సిద్ధంగా ఉన్నామని పదేపదే తెలిపింది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటనలు కూడా చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ కన్నా సింగపూర్ సంస్థలకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని జగన్ భావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేబినెట్ లో తీర్మానించారు.
ఇకపోతే 2014 ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కన్సార్షియంతో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రోడ్‌కు పక్కన, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు సమీపంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. 1691ఎకరాల్లో అభివృద్ధి చేయదలచిన ఈ స్టార్టప్ ఏరియాను 3 దశల్లో పూర్తి చేయాలని ఒప్పందం ఉంది.
అందుకు సంబంధించి సింగపూర్ కన్సార్టియంతో 15మే 2017న ఒప్పందం కుదుర్చుకుంది. 15ఏళ్లలో మూడు విభాగాల్లో పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలి విడతగా మూడేళ్లలో 656ఎకరాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచి, 8.07లక్షల చదరపు అడుగుల బిల్డింగ్ స్పేస్ రూపొందించాలని సూచించింది.
ఆ మెుదటి ఫేజ్ లోనే ప్రభుత్వ శాఖలు- కార్యాలయాలు స్థాపించేలా సుప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాలని ప్రణాళికలు రచించింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.
రాజధాని నిర్మాణంలో భాగంగా రైతుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం 33 వేల పైచిలుకు ఎకరాల భూమిని తీసుకుంది. అనంతరం సింగపూర్ కన్సార్షియంతో రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని ప్రాంతం అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. అమరావతి అర్బన్ నోటిఫైడ్ ఏరియా, దాని నగర అభివృద్ధి మరియు ప్రణాళికా కార్యకలాపాలు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థచే నిర్వహించబడుతున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే సింగపూర్ కన్సార్టియం అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ కన్సార్టియం రూ.306కోట్లతో 58 శాతం, ఇకపోతే అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ 42 శాతం వాటాతో రూ.222కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధిలో రూ.2118 కోట్లతో అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టింది. రాజధాని ప్రాంతంలో మౌళిక వసతుల కల్పనకు అంటే రోడ్లు, వాటర్, డ్రైనేజ్ విద్యుత్ సరసఫరాకు ఖర్చు చేసింది.
అదే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందంలో భాగంగా తొలి విడతగా మూడేళ్లలో 656ఎకరాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరచి, 8.07లక్షల చదరపు అడుగుల బిల్డింగ్ స్పేస్ రూపొందించాలని ఆదేశించింది.
రాజధాని ప్రాంతంలో రాబోయే 15 సంవత్సరాలలో 1.25 లక్షల కుటుంబాలు నివసించే అవకాశం ఉందని అలాగే 2.50 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు ప్రకటించారు. ఇకపోతే స్టార్ట్ అప్ ఏరియా ఒకసారి అభివృద్ధి చెందితే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో1.15 కోట్లు సమకూరుతుందని తెలుస్తోంది. అలాగే రెవెన్యూ రూ.8వేల కోట్లు నుంచి రూ.10వేల కోట్లు వరకు వివిధ రూపాలలో ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుందని తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రత్యేక దృష్టిసారించిన జగన్ సర్కార్ అమరావతి స్టార్ట్-అప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ టిడిపి ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు తెరలేపిందని ఆరోపించింది.
సింగపూర్ కన్సార్టియం ఒప్పందంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయిలో రాజధాని నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం కాలం వెళ్లదీసిందే తప్ప ఎలాంటి పనులు చేపట్టలేదని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇకపోతే ఈ అమరావతి స్టార్ట్ అప్ కన్సార్టియం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదిత 1691 ఎకరాల్లో 170 ఎకరాలు నది ఒడ్డున ఉండటంతో ఈ స్థలం పర్యావరణ-చట్టపరమైన చిక్కుల్లో పడింది. దాంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని ఆనాటి ప్రభుత్వం ఆలస్యంగా గ్రహించింది.
ఇకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సైతం ఈ ప్రతిపాదిత భూములపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సింగపూర్ కంపెనీ కోరింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో కోర్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను మార్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది.
అయితే అప్పటికే ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలకు భూమిని కేటాయించడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అమరావతి స్టార్ట్ అప్ ప్రాజెక్టుకు అడుగులు పడలేదు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఐదునెలల అనంతరం ఆ ఒప్పందాన్నే రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై రూ.30 వేల కోట్ల దుబారా: నివేదిక సమర్పించిన పీటర్ కమిటీ
రాజధానిగా అమరావతి డౌటే, సాకులు చెప్తున్న ప్రభుత్వం: బొత్స సంచలన వ్యాఖ్యలు