రాజధానిపై ప్రభుత్వ ప్రకటన ఇప్పుడే ఎందుకంటే...: వర్ల రామయ్య
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ డైవర్షన్ యాటిట్యూట్ కలిగిన వ్యక్తి అని... ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై అతడు తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటి ఎత్తుగడల్లో భాగమేనని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు.
అమరావతి: దున్నపోతుమీద వానకురిసినట్లుగా ప్రస్తుత వైసిపి ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం అచేతనావస్థలో ఉందని... ఎవరేమనుకున్నా స్పందించడంలేదంటూ విమర్శించారు. తనపై ఉన్న కేసులవిచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రాజధానిలో రగడ సృష్టించాడని రామయ్య పేర్కొన్నారు.
బుధవారం ఆత్మకూరులోని పార్టీ జాతీయకార్యాలయంలో రామయ్య విలేకరులతో మాట్లాడారు. మేధావులు, ప్రజాసంఘాలు, కోర్టులు, ప్రతిపక్షం, ప్రజలు ఎన్నిచెప్పినా ఖాతరు చేయకుండా జగన్ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. అస్మదీయులు, తస్మదీయులుని విభజించి మరీ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డిస్తూ వ్యక్తిగత కక్షతోనే కొందరు అధికారులపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు లకు పాల్పడుతోందన్నారు.
జగతి పబ్లికేషన్స్ షేర్‌వ్యాల్యూ పెరుగుదలలోని లోగుట్టుని, ఆనాడు నష్టాల్లో ఉన్న పత్రికాసంస్థ సాక్షిలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడుల వ్యవహారాన్ని బయటపెట్టాడన్న దురుద్దేశంతోనే కృష్ణకిశోర్‌పై జగన్ కక్షసాధిస్తున్నారన్నారు.
read more అలా చేస్తే జగన్ మరోసారి జైలుకే: దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
జగన్ ఎంపీగా ఉన్నప్పుడు జగతి పబ్లికేషన్స్ షేర్ వ్యాల్యూ రూ.10లోపుగా ఉంటే ఒక్కోషేర్‌ని రూ.350కి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇలా వాన్‌పిక్ సంస్థకి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ షేర్ల కొనుగోలు ద్వారా రూ. 834కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడిగా పెట్టాడన్నారు. ఈ ఉదంతంపై సీబీఐ విచారణ జరిపే క్రమంలో జగతి పబ్లికేషన్స్‌కి నిమ్మగడ్డ ప్రసాద్‌కి మధ్య జరిగిన లాలూచీ వ్యవహారాన్ని ఆనాడు ఇన్‌కంటాక్స్ అధికారిగా ఉన్న కృష్ణకిశోర్ బయటపెట్టడం జరిగిందన్నారు.
గతంలో తన విధినిర్వహణను సక్రమంగా చేసిన సదరు అధికారి చర్యను మనసులో పెట్టుకున్న జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అతన్ని సస్పెండ్ చేశారని ఆరోపించారు. కనీసం జీతంకూడా ఇవ్వకుండా నిలిపివేశారని, దీనిపైనే క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్) జోక్యం చేసుకుందన్నారు. కృష్ణకిశోర్‌పై సీఐడీ విచారణకు ఆదేశించిన జగన్ సర్కారు ఆ నివేదిక వచ్చేవరకు కూడా ఆగకుండా చర్యలు తీసుకోవడం కక్షసాధించడం కాదా అని రామయ్య ప్రశ్నించారు.
కేంద్రసర్వీసులకు తిరిగివెళ్తానన్నా వెళ్లనివ్వకుండా ఆ అధికారి హోదాను మార్చి జీతభత్యాలు చెల్లించకుండా ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థ క్యాట్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని గుర్తుచేశారు. తప్పుడుశక్తులు జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని, దీనిని ఇలానే కొనసాగిస్తే పరిపాలించడానికి చివరకు ఏమీ మిగలదని కూడా క్యాట్ చెప్పిందని వర్ల స్పష్టంచేశారు.
read more అమరావతికి రక్షణగా వున్న చట్టాలివే... ఒక్క కలంపోటుతో...: ఎంపీ కనకమేడల
మాటవినని అధికారుల్ని అధికారమనే ఉక్కుపాదంతో జగన్ సర్కారు అణచివేస్తోందన్నారు. క్యాట్ వ్యాఖ్యలతోనైనా జగన్ తన ధోరణి మార్చుకోవాలని వర్ల సూచించారు. పీపీఏల రద్దు , పోలవరం రివర్స్ టెండర్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేయడం వంటి చర్యలపై కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడంతో జగన్ బుర్ర పనిచేయడం లేదని ఆయన దెప్పిపొడిచారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే 3 నుంచి 4లక్షల జీతం తీసుకునే జగన్ ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారన్నారు. తిరోగమన దిశలో జగన్ ప్రభుత్వం నడుస్తోందన్నారు వర్ల రామయ్య.