విజయవాడ:  సిఎం జగన్ అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత లేక రాజధానివాసులే కాదు రాష్ట్రప్రజలు కూడా  అయోమయానికి గురవుతున్నారని అన్నారు. సీఎం జగన్ నోటి వెంట ఇంతవరకు అమరావతి అనే మాటే రాలేదని ఆరోపించారు.

స్పోర్ట్స్ సిటీ, జస్టీస్ సిటీ, జర్నలిస్టు సిటీ, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ, గవర్నమెంట్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ ఇలా తొమ్మిది సిటీల నిర్మాణం కోసం గతంలో మాజీ సీఎం చంద్రబాబు కృషి చేశారని గుర్తుచేశారు. 

ఇన్ని పనులు చేస్తే రాజధాని కోసం చంద్రబాబు ఏమీ చేయలేదని బొత్స మాట్లాడటం విడ్డూరంగా  వుందన్నారు.మంత్రి  బొత్స, ఎంపీ విజయసాయి రెడ్డిలు రాత్రి రహస్యంగా అయినా రాజధానిలో పర్యటించాలని... అప్పుడయినా వారికి రాజధానికోసం టిడిపి ప్రభుత్వం చేసిన పనులు కనిపిస్తాయని అన్నారు. 

read more  ఏపిపై ఒకేసారి విరుచుకుపడుతున్న రెండు అల్పపీడనాలు... భారీ వర్ష సూచన

2018లోనే రాజధానిలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు.రాజధాని విషయంలో వైసిపి నేతలు బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని రామయ్య విమర్శించారు. 
అమరావతి పేరు ఉండకూడదనే జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇంద్రుడి రాజధాని అమరావతి పేరు తీస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ప్రభుత్వ తీరు వల్ల కళకళలాడే రాజధాని ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోందన్నారు. టిడిపి పార్టీ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని వర్గాల వారు రావడానికి సిద్దమయ్యారని...నిద్ర నటిస్తున్న జగన్ ను ఈ సమావేశం ద్వారా లేపుతామని రామయ్య అన్నారు. 

రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరూ రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని విస్మరించి సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారంటూ ఇదివరకే వర్ల రామయ్య వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహిళలందరూ తలదించుకునేలా బూతుల పంచాంగం విప్పుతున్నారని,  ఈ మంత్రులు మనుషులేనా అన్న అనుమానం కలిగేలా వారి మాటలున్నాయని అన్నారు.

read more  video:రాష్ట్రంలో మతకల్లోలాలకు కుట్రలు... అందుకోసమే టీటీడిపై దుష్ఫ్రచారం: వైవి సుబ్బారెడ్డి

కొడాలినాని బూతులగురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమవుతుందని, మంత్రుల బూతులు జగన్‌ దృష్టికి వెళ్తున్నాయా అని అన్నారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్‌ వ్యవస్థనేది ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు.   

చంద్రబాబునాయుడు వంటి వ్యక్తిని పట్టుకొని వాడు, వీడు, నీచుడు అని సంబోధించడం బూతుల మంత్రికే చెల్లిందన్నారు. ఉచ్చనీచాలు, చదువు, సంస్కారం లేనివ్యక్తి తన కేబినెట్లో మంత్రిగా ఉంటే జగన్‌ ఏంచేస్తున్నాడన్నారు. కేబినెట్‌కి నాయకత్వం వహించే ముఖ్యమం త్రి, తన మంత్రులను కట్టడిచేయడంలో విఫలమయ్యాడని రామయ్య తేల్చిచెప్పారు. 

 కొడాలి నానికి మంచి, మర్యాద తెలిసుంటే, తనలో మానవత్వముంటే ఆయన తనభాషను మార్చుకోవాలని వర్ల సూచించారు. అన్నంతినేవారు, బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరూ నానిలా మాట్లాడరని, ఆయన సంగతైతే తనకి తెలియదని చెప్పారు.

పోలీస్‌వ్యవస్థలో డీజీపీ సుప్రీం అయినప్పటికీ, ఆయనతోపాటుగా ఆరుగురు అడిషనల్‌ డైర్టెర్స్‌ ఆఫ్‌ జనరల్‌ పోలీసులు ఉన్నారని, చంద్రబాబు పర్యటనలో పోలీస్‌శాఖ వ్యవహరించిన తీరు సరిగా ఉందో లేదో వారే సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడికి సంబంధించి సమాధానం చెప్పే, అర్హతను తన దృష్టిలో డీజీపీ కోల్పోయాడని వర్ల తెలిపారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్నవ్యక్తి పర్యటిస్తుంటే సెక్షన్‌-30 అమలుచేయకుండా నిరసనలకు ఎలా అనుమతించారో ఆరుగురు అడిషనల్‌ డీజీపీలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుపై దాడిచేయడానికే  వైసీపీ వారికి పోలీసులు అనుమతి ఇచ్చారా అని వర్ల నిలదీశారు. ఏపి డీజీపీ చర్యపై ఢిల్లీస్థాయి లో నిలదీస్తామని, ఆయనకు పైనున్నవ్యవస్థ తలుపుతడతామని రామయ్య స్పష్టంచేశారు.