ఏపిపై ఒకేసారి విరుచుకుపడుతున్న రెండు అల్పపీడనాలు... భారీ వర్ష సూచన
ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం నుండి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచివుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో సోమవారం ఏపిలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు ప్రకటించారు.
నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం... ఈశాన్య అరేబియా సముద్రంలో లక్షదీవుల వద్ద మరో అల్ప పీడనం ఏర్పడినట్లు తెలిపారు. ఈ రెండూ 24 గంటల్లో వాయుగుండాలుగా మారుతాయని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో సోమవారం రాయలసీమలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.
రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించారు..కాబట్టి ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
read more వాతావరణ సమాచారం... ఏపికి పొంచివున్న భారీ వర్షం ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని విశాఖ వాతావరణ కేంద్రం ఆదివారమే ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.అలాగే మిగతాజిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.
ఇక ఈ ఉపరితల ద్రోణి ప్రభావం సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై వుండనుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది.