గుంటూరు:  ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించడంపై టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. అసలు రాజదానిని ఎందుకు తరలిస్తున్నారు? అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  అసలు విశాఖలో రాజధాని నిర్మించాలని ఎవరు అడిగారు? ఎవరికోసం అక్కడికి తరలిస్తున్నారు...?  ఈ తరలింపు వెనకున్నది ఎవరు...? అంటూ సత్యప్రసాద్ వైసిపి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇప్పటికే రాజధాని కోసం నిర్దేశించిన అమరావతిలో రూ. 9 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని... మరో పది వేల కోట్ల పనులు 90% పూర్తయినట్లు తెలిపారు. ఈ సమయంలో తరలించాల్సిన అవసరం ఏమిటి? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. 

తడ నుంచి ఇచ్చాపురం వరకూ మొత్తం రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు  కొనసాగుతున్న సమయంలో మార్చాల్సిన అవసరం ఏమోచ్చిందన్నారు. కొత్తగా విశాఖలో రాజధాని పనులు చేపడితే ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారం పడుతుందన్నారు. 

read more  సొంత నియోజకవర్గానికి జగన్ క్రిస్మస్ కానుక

విఛ్చిన్నంతో అభివృద్ధి సాధ్యం కాదని... అభివృద్ధి చేసిన రాజధానిని తరలించి ఏం సాధిస్తారని అన్నారు. రోడ్డెక్కిన రైతుల కుటుంబాల ఆవేదన, ఆక్రందనలకు జగన్ తుగ్లక్ నిర్ణయాలే కారణమన్నారు. భావితరాల భవిష్యత్తును నాశనం చేయవద్దని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. 

సీఎం అసంబద్ధ నిర్ణయంతో 90% మంది సన్నకారు రైతులు బలవుతున్నారని... మొత్తంగా 34322 ఎకరాల భూములిచ్చిన 29881 రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. వీరిలో అత్యధికంగా 20,490 మంది రైతులకు కేవలం 1 ఎకరం, అంత కన్నా తక్కువ భూమి మాత్రమే ఉందని తెలిపారు. 5227 మంది రైతులకు 1 నుండి 2 ఎకరాలకు మధ్య భూమి ఉందన్నారు. 

25,717 మంది  రాజధానికి ఇచ్చిన భూమిలో సుమారు 90 శాతం సన్న కారు చిన్నకారు పేదరైతులే ఉన్నారన్నది రికార్డులు స్పష్టం  చేస్తున్నాయని తెలిపారు.  వీరి జీవితాలు ఏం కావాలి.... పేదరికానికి కులము ఉంటుందా అంటూ ప్రశ్నించారు. 

read more  కుప్పం పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు... నాయకులతో చంద్రబాబు భేటీ

రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అడ్డగోలు గోబెల్ ప్రచారం చేస్తున్నారని... ప్రజల్లో అపోహలు సృష్టించడం వైసిపి నేతలకు భావ్యం కాదన్నారు.  10 ఎకరాలకు మించి ఉన్న రైతులు కేవలము 159 మంది మాత్రమే ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకొవాలని సూచించారు. కుల ముద్ర వేసి పేద రైతుల పొట్టకొట్టొద్దని... రాజధాని తరలింపుతో రాష్ట్రం అంధకారం కావడానికి జగన్ బాధ్యత వహించాలని అనగాని సత్యప్రసాద్ అన్నారు.