ప్రభుత్వ వైఫల్యాలు, పెట్టుబడులు, మూడు రాజధానుల వ్యవహరంపై తెలుగుదేశం పార్టీ యాత్రకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మొత్తం 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల నేతృత్వంలో ఈ యాత్ర నిర్వహించనున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా .. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యాత్ర పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అంతకుముందు ఇదే సమావేశంలో ఆయన మాట్లాడుతూ. టీడీపీ ఎమ్మెల్సీలు ధర్మం,న్యాయం వైపు నిలబడ్డారని ప్రశంసించారు. టీడీపీ ఎమ్మెల్సీలను ఎన్నో ప్రలోభాలకు గురిచేయాలని చూసినా వారు లొంగలేదని ఆయన గుర్తుచేశారు.

Also Read:ఢిల్లీకి ఏపీ సీఎం జగన్: మోడీ, అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్

అమరావతి కోసం పోరాడి టీడీపీ ఎమ్మెల్సీలు పోరాడి ప్రజల్లో వారి గౌరవం పెంచుకున్నారని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. తెలుగుదేశం హయాంలో కట్టిన భవనాల్లోనే దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

కేంద్రం వద్ద దిశ చట్టం పెండింగ్ లో ఉండగానే దిశ స్టేషన్ ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. తనపై పోస్టులు పెట్టినవాళ్లపై దిశ చట్టం కింద కేసు పెట్టమని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ఉన్నదానిపై కేసు ఎలా పెడ్తామని ఏఎస్‌పి అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ ఎలా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రికి చెప్పలేని నిస్సహాయులు వీళ్లు రూల్స్ చెబుతారా అని ప్రతిపక్షనేత చురకలంటించారు.

వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ను కోర్టులో ఎందుకు ఉపసంహరించారని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఆయన సోదరి హైకోర్టులో కేసు వేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:టీడీపీ నేతలకు గన్‌మెన్ల తొలగింపు.. నేను మీలా చేసుంటే: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

200మంది పోలీసుల అధికారులకు 8నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. రేపు తాము అధికారంలోకి వచ్చారని వైసీపీకి పనిచేశారని జీతాలు ఇవ్వకూడదా అని నిలదీశారు. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారని.. అయ్యన్న, అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారని బాబు మండిపడ్డారు.

తన ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే బొండా ఉమాపై కేసు పెట్టారని, మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణలపైనే అభియోగాలు నమోదు చేశారన్నారు. తాను కూడా ఇదే విధంగా చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా..? వైసీపీ నాయకులు ఊళ్లలో తిరిగే వారా అని చంద్రబాబు దుయ్యబట్టారు.