తనతో సహా టీడీపీ నాయకులందరి భద్రతను వైసీపీ ప్రభుత్వం తగ్గించిందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు ధర్మం,న్యాయం వైపు నిలబడ్డారని ప్రశంసించారు.

టీడీపీ ఎమ్మెల్సీలను ఎన్నో ప్రలోభాలకు గురిచేయాలని చూసినా వారు లొంగలేదని ఆయన గుర్తుచేశారు. అమరావతి కోసం పోరాడి టీడీపీ ఎమ్మెల్సీలు పోరాడి ప్రజల్లో వారి గౌరవం పెంచుకున్నారని చంద్రబాబు కొనియాడారు.

టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. తెలుగుదేశం హయాంలో కట్టిన భవనాల్లోనే దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం వద్ద దిశ చట్టం పెండింగ్ లో ఉండగానే దిశ స్టేషన్ ప్రారంభించారని ఆయన మండిపడ్డారు.

Also Read:నేనేం వాడుకోలేదు: ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందన ఇదీ...

తనపై పోస్టులు పెట్టినవాళ్లపై దిశ చట్టం కింద కేసు పెట్టమని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్నదానిపై కేసు ఎలా పెడ్తామని ఏఎస్‌పి అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ ఎలా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రికి చెప్పలేని నిస్సహాయులు వీళ్లు రూల్స్ చెబుతారా అని ప్రతిపక్షనేత చురకలంటించారు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ను కోర్టులో ఎందుకు ఉపసంహరించారని ఆయన ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే ఆయన సోదరి హైకోర్టులో కేసు వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. 200మంది పోలీసుల అధికారులకు 8నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని.. రేపు తాము అధికారంలోకి వచ్చారని వైసీపీకి పనిచేశారని జీతాలు ఇవ్వకూడదా అని నిలదీశారు.

ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారని.. అయ్యన్న, అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారని బాబు మండిపడ్డారు. తన ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే బొండా ఉమాపై కేసు పెట్టారని, మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణలపైనే అభియోగాలు నమోదు చేశారన్నారు.

Also Read:జగన్ సర్కార్ మరో షాక్: జేసీ దివాకర్ రెడ్డి భద్రత తొలగింపు

తాను కూడా ఇదే విధంగా చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా..? వైసీపీ నాయకులు ఊళ్లలో తిరిగే వారా అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలతో పెట్టుకుంటే పోలీసులకు కూడా మంచిది కాదని, చట్టబద్దంగా, న్యాయబద్దంగా పోలీసులు వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

రాష్ట్రానికి రెండు కళ్లలాంటి పోలవరం, అమరావతిని ఆపేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతపై పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఉద్యమం చేశారని.. అమరావతి కోసం మహిళలు రోడ్లెక్కారని చంద్రబాబు గుర్తుచేశారు.

పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించినా మహిళలు ఉద్యమాన్ని ఆపలేదని, రాజధానిపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను తమ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని ప్రతిపక్షనేత గుర్తుచేశారు.