రేపే ఏపి మంత్రివర్గ సమావేశం...ఇంకా వేదికపై కొనసాగుతున్న సస్పెన్స్
ఈ నెల 27వ తేదీన జరగాల్సిన ఏపి కేబినెట్ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి 24 గంటల సమయం కూడా లేకున్నా ఎక్కడ జరపాలన్న దానిపై క్లారిటీ రావడంలేదు.
అమరావతి: ఈ నెల 27వ తేదీన జరగాల్సిన ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అమరావతిలోని సచివాలయంలో కాకుండా విశాఖలో ఈ మంత్రివర్గ భేటీ జరగనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యం కాదని భావించి మళ్లీ అమరావతి ప్రాంతంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా మరోసారి కేబినెట్ బేటీపై మరో ప్రచారం మొదలయ్యింది.
అమరావతిలోని సచివాలయం నుంచి మరోచోటికి మారే అవకాశాలున్నాయని...అందువల్లే హఠాత్తుగా ప్రభుత్వం నోటీసుల జారీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి సమావేశం అనంతరం సీఎం జగన్ తో పాటు మంత్రులను అడ్డుకునేందుకు రాజధాని మహిళలు సిద్దమవుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందినట్లు సమాచారం. దీంతో కేబినెట్ సమావేశ వేదికను మార్చాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
రాజధాని రైతు కుటుంబాలతో పాటు అమరావతి ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డుపైకి వస్తే పోలీసులకు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఓ వైపు సీఎం, మంత్రులు. ఉన్నతాధికారులకు రక్షణ కల్పిస్తూనే నిరసనకారులను అడ్డుకోవాలి. ఈ క్రమంలో ఏదైన అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
read more అమరావతి ఉద్యమంలో విషాదం... నడిరోడ్డుపైనే బాధిత రైతు ఆత్మహత్యాయత్నం
అగ్రహావేశాలతో రగిలిపోతున్న రైతులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అధికంగా నిరసనలో పాల్గొంటే సున్నితంగా వ్యవహారించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం మరోచోట నిర్వహించుకుంటే మంచిదని... కాదని నిర్వహిస్తే భద్రతా పరమైన ఇబ్బందులు తప్పవని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నాడు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరులో ధర్నా దీక్షకు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు సిద్దమౌతున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికకు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉంది.ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఆందోళనలను కొనసాగించనున్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉన్నందున కేబినెట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రైతులు పోలీసులకు చెప్పారు. రోజు రోజుకూ రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు.
నా పేరుతో అధికారులపై ఒత్తిడి చేస్తే క్రిమినల్ కేసులు: విజయసాయిరెడ్డి
పెద్ద ఎత్తున ఆందోళనలు ఉన్న నేపథ్యంలో విజయవాడలోనే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వరరావులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.అమరావతిలో కూడ పలువురు నేతలను కూడ పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
రైతులకు బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలు,ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు,డాక్టర్ల సంఘాలు మద్దతును ప్రకటించాయి. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.