అమరావతి ఉద్యమంలో విషాదం... నడిరోడ్డుపైనే బాధిత రైతు ఆత్మహత్యాయత్నం
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమంలో అపశృతి చోటుచేసుకుంది. రాజధానికోసం భూమిని కోల్పోయిన ఓ రైతు అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించడాన్ని నిరసిస్తూ గతకొన్ని రోజులుగా రైతులు నిరసన బాట పట్టారు. అయితే వారి నిరసనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా శుక్రవారం కేబినెట్ బేటీని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాజధానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ రాజధాని రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు రమేష్ కుమార్ తనకున్న నాలుగెకరాల భూమిని అమరావతి నిర్మాణంలో భాగంగా కోల్పోయాడు. అయితే రాజధానిని అమరావతి నుండి తరలిస్తామన్న సీఎం జగన్ నిర్ణయించగా దాన్ని జీఎన్ రావు కమిటీ కూడా సమర్ధించింది. దీంతో గతకొద్దిరోజులగా రమేష్ సాటి రైతులతో కలిసి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నిరసన చేపడుతున్నారు.
కానీ వీరి నిరసనలను ప్రభుత్వం గుర్తించకుండా శుక్రవారం తుది నిర్ణయాన్ని తీసుకునేందుకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రమేష్ నడిరోడ్డుపైనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే వున్న పోలీసులు, స్థానికులు అప్రమత్తమై అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.
read more విశాఖకు జైకొట్టిన శ్రీ భరత్: బాలకృష్ణ కుటుంబంలో చిచ్చురేపిన జగన్...?
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నాడు మహాధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందుజాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేశారు.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ తుళ్ళూరులో ధర్నా దీక్షకు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు సిద్దమౌతున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికకు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉంది.ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఆందోళనలను కొనసాగించనున్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉన్నందున కేబినెట్ సమావేశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రైతులు పోలీసులకు చెప్పారు. రోజు రోజుకూ రైతులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు.
ఇవాళ కూడ పెద్ద ఎత్తున ఆందోళనలు ఉన్న నేపథ్యంలో విజయవాడలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అమరావతిలో కూడ పలువురు నేతలను కూడ పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
read more టీడీపీ సీనియర్ నేత హఠాన్మరణం.. చంద్రబాబు దిగ్భ్రాంతి, చిరు ప్రజారాజ్యంలో..
రైతులకు బీజేపీ,కాంగ్రెస్,వామపక్షాలు,ప్రజా సంఘాలు, న్యాయవాద సంఘాలు,డాక్టర్ల సంఘాలు మద్దతును ప్రకటించాయి. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురువారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.