అమరావతి మహిళలపై పోలీసుల దాడి... జాతీయ మహిళా కమీషన్ సీరియస్
అమరావతిలోనే రాాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన మహిళలపై పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జాతీయ మహిళా కమీషన్ చర్యలకు సిద్దమైంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన నిరసనలు జాతీయ మహిళా కమీషన్ దృష్టికి వెళ్లాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మహిళా కమీషన్ స్పందించింది. తుళ్లూరు మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడమే కాదు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
శనివారం అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీని పంపనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కమిటీసభ్యులు నిజానిజాలు తెలుసుకుని తమకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Farmers March : ఫెన్సింగ్ దూకిన మహిళలు..పోలీసుల లాఠీఛార్జ్
తుళ్లూరులో మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారన్న వార్తల నేపథ్యంలో సుమోటాగా ఈ కేసు విచారణను స్వీకరించినట్లు తెలిపారు. వెంటనే ఓ నిజనిర్దారణ కమిటీని కూడా ఏర్పాటు చేసి అమరావతికి పంపించాలని నిర్ణయించామన్నారు.
శుక్రవారం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తుళ్లూరుకు చెందిన మహిళలు పాదయాత్రగా రాజధాని శంఖుస్థాపన ప్రాంతానికి వెళ్లారు. అయితే నిరసనల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆంక్షలు విధించిన పోలీసులు శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లకముందే మహిళల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసులు ఏర్పాటుచేసిన పెన్సింగ్ ను సైతం దాటుకుని మహిళలు, రైతులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య సాగిన ఈ ఘటనతో తుళ్లూరులో యుద్దవాతావరణం నెలకొంది.
READ MORE అమరావతిలో ఉద్రిక్తత... పోలీసుల అదుపులోని మహిళ మృతిపై ఎస్పీ స్పష్టత
అలాగే తుళ్లూరులో చోటుచేసుకున్న పరిణామాలు ఓ వ్యక్తి అరెస్ట్ కు కారణమయ్యాయి. విధులలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేశాడంటూ తెనాలి శ్రవణ్ కుమార్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది.