రాజధాని అంటే చంద్రబాబు చెప్పినట్లు సంపదసృష్టే...కానీ అలా కాదు: అంబటి సెటైర్లు
రాజధాని పై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు, కానీ చంద్రబాబు బ్యాచ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తోందన్నారు.
తాడేపల్లి: రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అవసరం రావచ్చని మాత్రమే ముఖ్యమంత్రి జగన్ అసెంంబ్లీలో అన్నారని... రాజధానికి అమరావతి నుండి మారుస్తామని అనలేదని వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా టిడిపి నాయకులు తామేదో రాజధానిని అమరావతి నుండి మారుస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని అంబటి పేర్కొన్నారు.
సీఎం మూడు రాజదానుల ఆలోచనపై అన్ని ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీన్ని మంచి కాన్సెప్ట్ అంటూ ప్రశంసిస్తున్నారని... కానీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎప్పటిమాదిరిగానే ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తాము ఏం చేసినా చంద్రబాబుకు ఇష్టం ఉండదని... అదెంత మంచి పని అయినా వ్యతిరేకిస్తారని అన్నారు.
ఇక మరో పార్టీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడతాడో... తెలియక మాట్లాడతాడో తెలియని పరిస్థితి వుందన్నారు. మూడు రాజధానులు అంటే మూడు నగరాలు నిర్మించడమని ఆయన అనుకుంటున్నాడు...కానీ అలా కాదన్నారు. రాజధానులు అంటే పట్టణాలు నిర్మించడం కాదు.. అధికార కేంద్రాన్ని ఏర్పాటు చేయడమని తెలుసుకోవాలన్నారు.
read more తిండి లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకొచ్చి: మూడు రాజధానులపై పవన్ స్పందన
వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది జరుగుతుందని అంబటి వెల్లడించారు. గతంలోనే ఇలాంటి ప్రయత్నం చేసివుంటే అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళమన్నారు. పాలకులు పరిపాలన చేసుకోవాలి తప్ప వ్యాపారం చేయకూడదని చంద్రబాబుకు చురకలు అంటించారు.
మాజీ సీఎం చంద్రబాబు అతని బినామీలు అమరావతి ప్రాంతంలో నాలుగువేల ఎకరాలు కొని సంపద సృష్టించుకున్నారని అన్నారు. రాజదాని అంటే సంపద సృష్టి అని చెప్పుకునే బాబు తన సంపదను మాత్రం బాగానే సృష్టించుకున్నాడని ఎద్దేవా చేశారు.
రాజదానిపై సీఎం జగన్ ప్రకటన తరువాత కొంతమంది రైతుల పేరుతో నిరసన చేస్తున్నారని... దాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష నాయకులే వెనకుండి ఈ నిరసనలు చేయిస్తుందని ఆరోపించారు.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు.రైతుల ముసుగులో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమన్నారు. నిరసన వ్యక్తం చేస్తే తప్పులేదని... కానీ ఆ పేరుతో ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
read more రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా హెచ్చరిక
చంద్రబాబు చేసిన తప్పులు బయటకు వస్తాయనే భయపడిపోతున్నారని... రాజధాని కోసం రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. రాజధానులు ఏర్పాటైతే ఆటోమేటిక్ గా అభివృద్ధి సాగుతుందని.... కానీ ఓ నగరాన్ని నిర్మించాలనుకోవవడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని అంబటి హామీ ఇచ్చారు.