స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే 59 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం భావించిందని సత్తిబాబు చెప్పారు. అయితే తమ ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ అడ్డుతగిలిందని.. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన ప్రతాప్ రెడ్డి... టీడీపీ అధినేతకు సన్నిహితుడని బొత్స తెలిపారు.

Also Read:జగన్‌కు షాక్: రిజర్వేషన్ కోటా జీవోను కొట్టేసిన హైకోర్టు

రిజర్వేషన్లను అడ్డుకున్న చంద్రబాబును ఆ వర్గాల ప్రజలు క్షమించరని సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి 14వ ఆర్ధిక సంఘం నిధులు రావని.. అందుకే టీడీపీ ఈ కుట్రకు తెరలేపిందని బొత్స ఆరోపించారు.

ఆయా వర్గాలకు చెందిన నేతలు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబును నిలదీయాలని ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ను వేరు చేసే చట్టం, ఇంగ్లీష్ మీడియం విధానాన్ని టీడీపీ అడ్డుకుందని సత్యనారాయణ  గుర్తుచేశారు.

Also Read:బాబు విశాఖ టూర్‌పై డీజీపీకి హైకోర్టు షాక్: 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

పెన్షన్ల ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో అవినీతి చోటు చేసుకుందని, ఇప్పుడు తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. మూడు రాజధానులు, గవర్నర్ స్పీచ్‌లో ఉండకూడదని చెప్పడానికి యనమల ఎవరని.. అంటే ఆయన స్క్రిప్ట్ మేం చదవాలా అని బొత్స ప్రశ్నించారు.