Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగ యువత, విద్యార్థులకు నిలువునా మోసం...: జగన్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం

అధికారంలోకి రాకముందు, వివిధ సందర్భాలలో విద్యార్థులకు  అన్నివేళలా అండగా ఉంటానని, వారి చదువులకు అవసరమైన సమస్త సౌకర్యాలను అందిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

Kollu Ravindra Fires On AP CM YS Jagan
Author
Guntur, First Published Feb 24, 2020, 9:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: అధికారంలోకి రాకముందు విద్యార్థులను, యువతను మోసగించిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కూడా అదే పని చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా ఆయా వర్గాలను ముఖ్యమంత్రి మరింత నయవంచనకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. 

సోమవారం కొల్లు రవీంద్ర మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు, వివిధ సందర్భాలలో విద్యార్థులకు  అన్నివేళలా అండగా ఉంటానని, వారి చదువులకు అవసరమైన సమస్త సౌకర్యాలను అందిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కాడన్నారు. పేద విద్యార్థినీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు.  

ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే సమయమున్నా జగన్ ఇచ్చినహామీ ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి డబ్బులు అందలేదన్నారు. ప్రతిఏటా ఒక్కో విద్యార్థికి రూ.1,50,000 ఇస్తానన్న జగన్ నేడు వసతి దీవెన కార్యక్రమం పేరుతో అరకొరగా రూ.7,500 ఇవ్వడం, ఆ కొద్దిమొత్తం కూడా అతితక్కువ మందికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, మెస్ బిల్లులు చెల్లించలేదని, అవి అందక విద్యార్థిలోకం నానా అగచాట్లు పడుతున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. 

మేనిఫెస్టోలో పేదవిద్యార్థుల చదువులకు ఎంతఖర్చయితే అంత మొత్తం తమ ప్రభుత్వం భరిస్తుందని, కాస్మొటిక్ ఛార్జీల కింద అదనంగా ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడెందుకు ఇలా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నాడని రవీంద్ర దుయ్యబట్టారు. రూ.లక్షన్నరపైగానీ, అదనంగా ఇస్తానన్న రూ.20వేలపైగానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదని, అసలుకి కొసరుకు ఎసరుపెట్టిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు.

read more  రాష్ట్రంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభోత్సవ సభలో మహిళలకు జగనన్న వరాలు

విద్యా సంవత్సరం ముగింపుదశకు వచ్చాక అరకొర చెల్లింపులు చేస్తూ వసతిదీవెన పేరుతో జగన్ తనకుతానే డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే 16లక్షల మంది విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ సంఖ్యని 11 లక్షలకు కుదించాడన్నారు. జగన్ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం చేకూరుతోందని, అమ్మఒడి పథకాన్ని కూడా డిగ్రీ, ఇతర అనుబంధ, వృత్తి విద్యా కోర్సులు అవలసంభిస్తున్న విద్యార్థులకు ముడిపెట్టి కుటుంబంలో ఒక్కరికే న్యాయం చేస్తాననడం జగన్ చౌకబారుతనానికి నిదర్శనమన్నారు. 

గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రూ.35వేల నుంచి రూ.40 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచితే, దాన్ని ఎంతమొత్తమైతే అంతమొత్తం ఏకకాలంలో చెల్లిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడెందుకు దాన్ని రూ.45వేలకే పరిమితం చేసి విద్యార్థుల సంఖ్యను ఎందుకు తగ్గించాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నయవంచనకు గురిచేయడం ద్వారా జగన్ సర్కారు జగనన్న వసతిదీవెన పేరుతో నయా మోసానికి తెరలేపిందన్నారు. 

జగన్ చర్యల వల్ల అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయని... పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఫీజులు చెల్లిస్తేనే హాల్ టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. మెస్ బిల్లులను రూ.1450పెంచుతామని చెప్పిన జగన్  9నెలలైనా కూడా ఒక్క విద్యార్థికి కూడా పెంపుతో సంబంధంలేకుండా పాతమొత్తాలతో కలిపికూడా  ఆ బిల్లులు చెల్లించలేదన్నారు. 

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నిలిపివేయడం, మెస్ బిల్లులు చెల్లించకపోవడం, కాస్మొటిక్ ఛార్జీలు ఆపేయడం, తమ్ముడికో, చెల్లిలికో అమ్మఒడి డబ్బులిస్తే, పెద్దచదువులు చదివే వారి అన్నయ్యలకు, అక్కలకు డబ్బులివ్వకపోవడం వంటి  చర్యలతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థిలోకాన్ని నిలువునా మోసగించడన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకాన్ని ఆపివేయడం ద్వారా కళాశాల విద్య ఆరంభంలోనే జగన్ డ్రాపవుట్స్ సంఖ్య పెరిగేలా చేశాడన్నారు. 

అదేవిదంగా విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సాయం చేసిందని, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, విదేశీ విద్యాదరణ పథకాల కింద రూ. 10లక్షల వరకు సాయం చేసిందన్నారు. ఆయా పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులు లబ్దిపొందారని, గత ప్రభుత్వంలో ఆయాపథకాల ద్వారా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లినవారికి కూడా జగన్ సర్కారు సాయాన్ని నిలిపివేసిందన్నారు. 

గ్రూప్2, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం, ఆయా విద్యార్థులకు రూ.10వేలవరకు స్టయిఫండ్ ఇవ్వడంతోపాటు కోచింగ్ కేంద్రాలకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వరకు అందచేస్తే,  జగన్ వచ్చాక ఆ పథకమే మరుగున పడిందన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకం ధ్వారా టీడీపీ ప్రభుత్వం రూ.1,75,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిందని, జగన్ వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. 

readmore  రోజా అక్క... మీ ఎంపీని ఏం చేయమంటావ్...?: వర్ల రామయ్య

నిరుద్యోగ భృతి కింద టీడీపీ ప్రభుత్వం 6లక్షల మందికి నెలనెలా భృతిని అందచేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను రోడ్డున పడేశాడన్నారు. 9వ తగరతి చదివే విద్యార్థులకు సైకిళ్లు అందచేయడం, ప్రతిఏటా మెగాడిఎస్సీ నిర్వహించడం వంటి పనులన్నీ, చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తే, జగన్ సీఎం అయ్యాక వాటన్నింటినీ అటకెక్కించడాని రవీంద్ర మండిపడ్డారు.  ఈ విధంగా విద్యార్థులు, యువత సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్  ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్లుగా తన మంత్రివర్గంతో గానాభజానా చేయించుకుంటున్నాడన్నారు. 

ఎన్నికల హామీలను అమలుచేయకుండా పేదవిద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, మెస్ బిల్లులు చెల్లించకుండా కాలయాపనచేస్తున్న జగన్ సర్కారు. రూ.1400కోట్లను రంగులేయడానికి దుర్వినియోగం చేసిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా, పథకాలను ఎప్పుడూ ఆపలేదని, జగన్ మాత్రమే చంద్రబాబు పథకాలను ఆపేసి అన్ని వర్గాలను నయవంచనకు గురిచేశాడని, నవరత్నాల పేరుతో నయవంచనకు గురిచేశాడన్నారు. మహిళలు, రైతులు, యువతతోపాటు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ చర్యలకు నిరసనగా విద్యార్థిలోకం రోడ్డెక్కే రోజు దగ్గర్లోనే ఉందని రవీంద్ర హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios