అమరావతి: ఓ ప్రణాళిక, ఆలోచన లేకుండానే గత ఏడు నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ పాలన సాగుతోందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే కాదు మంత్రులు కూడా అసలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకే కాదు మాలాంటి రాజకీయ నాయకులకు కూడా అర్థంకావడం లేదన్నారు. రోజుకో మాట...పూటకో ప్రకటన చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

ఇక రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం జగన్ ప్రభుత్వం వల్ల కాదని అర్థం అయ్యిందని... అందువల్లే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో తాజాగా  చోటుచేసుకన్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీకి పిర్యాదు చేయనున్నట్లు నాదెండ్ల వెల్లడించారు. 

పెట్టుబడులు వెనక్కి పోతుంటే ఈ ప్రభుత్వం  చూస్తూ వుంటుందే తప్ప వాటిని ఆపై ప్రయత్నం చేయడంలేదన్నారు. దీంతో నూతన పరిశ్రమలు కూడా రావడం లేదని... ఇలాగయితే  నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  

read more  రైతుల జీవితాలతో ఆడుకున్నది చంద్రబాబే... తగిన శాస్తి జరిగింది: నాగబాబు

రాజధానికి భూములు ఇవ్వడానికి రైతులకు  తొమ్మిది నెలలు సమయం పట్టిందని గుర్తుచేశారు. రైతులకు నమ్మకం కలిగాకే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, ప్రజలు కలసి పోరాడాలని... మీకు తోడుగా జనసేన ఉంటుందన్నారు. ఎల్లవేళలా మహిళలకు, రైతులకు, కూలీలకు పవన్ కళ్యాణ్, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

గత ప్రభుత్వం రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటుచేస్తామని చెప్పినప్పుడు ప్రతిపక్షంలో వున్న జగన్ అగీకారం తెలిపారన్నారు. అన్నిజిల్లాలో సమాన అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం తిట్టుకోవడానికి ,విభేదించడానికి శాసన సభను వాడుతున్నారే తప్ప...ప్రజా సమస్యలపై చర్చ జరపలేదని మండిపడ్డారు. ప్రజలపై ప్రేమే ఉంటే రోజుకో  గ్రామానికి వెళ్లి అభివృద్ధి గురించి ఆలోంచించాలని సూచించారు.  వైసిపి నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప....ప్రజలను పట్టించుకున్నది లేదన్నారు. 

ఆ నాడు రైతులు భూములు రాష్ట్రం కోసం ఇచ్చారే తప్ప చంద్రబాబు కి ఇవ్వలేదన్నారు. ఐదు సంవత్సరాల్లో రాజధాని పనులు పూర్తి చెయ్యాల్సిన చంద్రబాబు ఎందుకు పూర్తిచేయ్యలేదో తెలియదన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు తప్పు కూడా ఉందన్నారు.  

read more  రాజధాని వివాదం... తల తోక తీసేసి పార్టులు పార్టులుగా విడగొడతారా...: వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి

వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకునే శ్రద్ధ ప్రజా సంక్షేమ పథకాలపై లేదన్నారు. ఎన్నికల  తరువాత కొత్త ప్రభుత్వం పై విమర్శలు చెయ్యకుండా ఆరు నెలలు వేచి చూద్దాం అనుకున్నాం కానీ ఈ ఆరు నెలల్లో వైసీపీ చేసిందేమీ లేదని అన్నారు. ఎక్కడో ఏసీ రూములో కూర్చుని రాజదాని పై నివేదిక తయారు చేయడం కాదని ప్రజల్లోకి వచ్చి, ప్రజా సమస్యలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల అన్నారు.