తన గోరీ తానే కట్టుకుంటున్న ఏకైక నాయకుడు జగన్: కళా వెంకట్రావు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. రాజధాని మార్పు పేరుతో జగన్ తన సమాధిని తానే కట్టుకుంటున్నాడని విమర్శించారు.
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ముఖ్యమంత్రి అప్రజాస్వామిక విధానాలతో నియంతలా వ్యవహరిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కళా వెంకట్రావు విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్ణయం సరికాదు కాబట్టి ప్రజలు తిరగబడతారనే భయంతో చుట్టూ 8 వేలమంది పోలీసులను రక్షణగా పెట్టుకుని జగన్ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ వ్యవధిలోనే ఈ గతి ఎందుకు పట్టిందో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని సూచించారు.
read more బాబు రాజధాని గ్రాఫిక్స్, 35 ఏళ్ళు పడుతుంది: మంత్రి కన్నబాబు
మూడు రాజధానుల పేరుతో జగన్ తీసుకున్న పిచ్చి తుగ్లక్ చర్యతో తన గోరీ తానే కట్టుకున్నారని అన్నారు. అసెంబ్లీలో మీరు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తరలివస్తున్న ప్రజలపై పోలీసులు విరుచుకుపడటం అప్రజాస్వామ్య చర్య అని మండిపడ్డారు. చట్టాలను, వ్యవస్థలను చేతులోకి తీసుకుని అణిచివేత ధోరణితో ముందుకెళ్తున్న జగన్ కు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాజధాని మార్చే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అమరావతే రాజధానని, దాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పిన విషయం ఈ ముఖ్యమంత్రికి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలోనూ అబద్ధాలు చెప్పి ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు.
read more ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ: అసెంబ్లీలో సీఎం జగన్
అమరావతిని కాపాడుకునేందుకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న జేఏసీ, ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేయడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన నియంత్రృత్వ పోకడలను విడనాడాలని... కాదని మూర్ఘంగా ముందుకెళ్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని కళా వెంకట్రావు హెచ్చరించారు.