అమరావతి: రాజధానిపై ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సంధర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ... ప్రతిపక్ష నాయకులు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

గతంలో శివరామక్రిష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కొత్తగా నగరాన్ని సృష్టించాలంటే మూడు నాలుగేళ్లు పడుతుందని అన్నారు. బాబు గ్రాఫిక్స్  చూపించిన రాజధాని నిర్మించాలంటే మాత్రం 35 ఏళ్లు పడుతుంది. రాజధాని పేరుతో చంద్రబాబు రూ.5700 కోట్లు వృధాగా ఖర్చు చేశారని... నగరాన్ని నిర్మించుకుంటే కీర్తి కాదన్నారు. 

విశాఖపట్నం ఒకప్పుడు మత్స్యకార కుగ్రామం అని....ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించి మహానగరంగా మారిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే అతిపెద్ద నగరం కాబట్టి అన్ని వనరులున్నాయి. పరిశ్రమలు, పోర్టు,  కనెక్టివిటీ వుందన్నారు. 

రాజధాని అమరావతిని ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయడంలేదన్నారు. అక్కడే లెజిస్లేచివ్ వ్యవహారాలన్ని నడుస్తాయని... అది కూడా ఓ రాజధానే అన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. 

read more  ఏపీ అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం

అయితే విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదని... ఇది ఆసియాలోనే అతివేగంగా అభివృద్ది అవుతున్న నగరమని అన్నారు. విశాఖలో అద్భుతమైన వసతి సౌకర్యాలున్నాయి కాబట్టే చంద్రబాబు గతంలో అనేక కార్యక్రమాలు ఇక్కడే చేపట్టారని గుర్తుచేశారు. 

 గతంతో ఇదే విశాఖలో జరిగిన బిజినెస్ సమ్మిట్ లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే.... సగానికి పైగా విశాఖ నగరం చుట్టే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపాయని పేర్కొన్నారు. దీన్నిబట్టి బయటి ప్రపంచం అమరావతి కంటే విశాఖనే ఎక్కువ గుర్తించిందని అర్థమవుతుందన్నారు. 

దేశంలో 150 వెనుకబడిన జిల్లాలంటే వాటిలో కడప, విశాఖపట్నం, విజయనగరం వున్నాయని నీతి ఆయోగ్ రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. అలాంటి చోట రాజధాని పెడతామంటే అడ్డుకోవడం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గత పాలకులు శాశ్వత పద్దతిలో అభివృద్ది చేయలేకపోయారని...అలాంటి పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. 

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూనివర్సిటీలు లేని ఏకైక జిల్లా విశాఖ అని పేర్కొన్నారు. మావోల ప్రభావం ఎక్కువగా వుండే ప్రాంతం విశాఖ అని బ్రాండింగ్ వేసి అక్కడ రాజధాని ఎలా పెడతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. అలా అయితే  మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని హైదరాబాద్ సమీపంలోనే మావోలు దాడిచేసి చంపారు  అందువల్ల హైదరాబాద్ నుండి రాజధానిని మార్చారా అని నిలదీశారు. 

నక్సల్ బరీ ఉద్యమం పుట్టిందే శ్రీకాకుళంలో అని...వెనుకబాటుతనం వుంది కాబట్టే అక్కడి ప్రజల్లో తిరుగుబాటు లక్షణాలు వచ్చాయన్నారు. వారిని చంద్రబాబు లాంటి  కృత్రిమ పోరాటాలు కావని ఆకలి కేకల పోరాటాలని కన్నబాబు అన్నారు. 

read more  విశాఖలో నాకు ఒక్క ఎకరం ఉన్నట్టు నిరూపించాలి: మంత్రి బొత్స సవాల్,

 అమరావతి  వల్ల భారత్ కు ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు బలపడతాయని,  వ్యాపారాలు పెరుగుతాయి అంటూ అర్ధంపర్థం లేని వార్తలు టిడిపి అనుబంధ పత్రికలు రాస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. అమరావతిని తమ వాళ్లకోసమే నిర్మించామని చంద్రబాబు ఒప్పుకుంటే ఆలోచిస్తామని సీఎం చెప్పారని గుర్తుచేశారు. దేశంలోనే చక్రం తిప్పే స్థాయి నుండి చంద్రబాబు 29 గ్రామాలకు పరిమితమయ్యారని...  ఇంతకన్నా రాజకీయ పతనం ఏముంటుందని ఎద్దేవా చేశారు. జగన్ కు ఇంకా ఆయనపై ఎందుకు కోపం వుంటుందన్నారు. 

 చంద్రబాబు పరిస్థితి మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా వుందని ఎద్దేవా చేశారు. మొదట ఇసుక, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అమరావతి ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించి చివరకు తోకమువడం ప్రతిపక్ష  పార్టీకి అలవాటయ్యిందన్నారు. విజన్ 2020 అని గతంలో చంద్రబాబు అంటే అర్థం కాలేదని.... జోలె పట్టుకోవడం అని ఇప్పుడు అర్థమయ్యింది. 

మీడియా సపోర్టుతో చంద్రబాబు రెచ్చిపోతున్నారని... కానీ పగటి కలలు కనే నాయకుడు జగన్ కాదన్నారు.. అన్ని ప్రాంతాలకు సమాన గౌరవం, కులమతాలకు అతీతంగా అభివృద్ది చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. టిడిపి నాయకులు పోడియం వద్దకు వచ్చినా విశాఖకు చెందిన నాయకులు పోడియం వద్దకు రాకపోవడమే అక్కడి పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని కన్నబాబు అన్నారు.