గుంటూరు: అధికారంలోకి వచ్చిన 10నెలల తరువాత ముసుగువీరుడిలా ప్రజలముందుకొచ్చిన జగన్ ఆవేశంతో ఊగిపోయాడని...ఇప్పుడు సుప్రీం తీర్పుపై  కూడా తన స్పందనేమిటో చెప్పాలని ముఖ్యమంత్రిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పట్టించుకోకుండా స్థానికసంస్థల ఎన్నికల వాయిదాపై వీరావేశంతో మాట్లాడిన జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతాడని అన్నారు. 

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దౌర్జన్యాలు చేయడం, పోలీస్, అధికార వ్యవస్థలతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎన్నికల్లో గెలిచానోచ్ అని అనిపించుకోవాలన్న తాపత్రయం తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయా లేదా.. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ప్రభుత్వ పరిధులేమిటి... ఏఏ విషయాల్లో ప్రభుత్వం కలుగచేసుకోవచ్చనే ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకెళ్లిందన్నారు. 

ఏ ప్రజాస్వామ్యమైతే తనకు 150సీట్లు ఇచ్చిందని జగన్ చెప్పుకుంటున్నాడో అదే ప్రజాస్వా మ్యం ఎన్నికల కమిషన్ కు స్వయంప్రతిపత్తి హోదా కల్పించి, స్వతంత్ర అధికారాలు కట్టబెట్టిందనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడన్నారు. రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందనే అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం విచారకరమని కళా అసహనం వ్యక్తంచేశారు. 

దుగ్ధతో, కక్షతో వ్యక్తులకు కులాన్ని అంటగట్టి మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. సుప్రీంతీర్పు దరిమిలా జగన్  తానుచేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కళా డిమాండ్ చేశారు. 

read more  జగన్ వ్యవహారంతో అవమానపడ్డది వారే... తలలు బాదుకుంటూ..: టిడిపి ఎమ్మెల్యే చురకలు

వ్యవస్థలు నాశనమైతే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పని, దానివల్ల అభివృద్ది, పాలన నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వం అనేది ఏఒక్కరిదో కాదు అది ప్రజలదని, అలాంటి వ్యవస్థ తీసుకునే నిర్ణయాల ప్రభావం అందరిపైనా ఉంటుందనే ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమంటే తానేనన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఎన్నికలు జరగకపోతే నిధుల రాకుండా పోతాయన్న ఆలోచన తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. 

ప్రజలు ఓటేస్తేనే ప్రభుత్వాలు ఉంటాయని... ఆ ప్రజలే లేకపోతే ప్రభుత్వం ఎక్కడినుంచి వస్తుందన్న ఆలోచనకూడా చేయకుండా జగన్ విపరీతధోరణితో వ్యవహరించాడన్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలో ఏవిధమైన చర్యలు తీసుకున్నారు... ఎందరికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు, విదేశాలనుంచి వచ్చిన వారిలో ఎందరి ఆరోగ్యపరిస్థితి ఎలా ఉందనే వివరాలు వెల్లడించకుండా ప్రభుత్వం పెద్ద తప్పుచేస్తోందన్నారు. 

పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ ఎవరికి ఇవ్వాలో, ఎందుకు వాడాలో కూడా తెలియకుండా మాట్లాడితే ఎలా అని కళా ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ పై ఎలా విమర్శలు చేయాలి, ఎన్నికల్లో ఎలా రిగ్గింగ్ చేయాలన్న ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రప్రజల ఆరోగ్యంపై మాత్రం శ్రద్దపెట్టడంలేదన్నారు. కరోనా గురించి ఆగస్టు వరకు ఆలోచించాలని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నాడని... దాని ప్రభావం రాష్ట్రంలో ఏమీలేదన్నట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. 

read more  సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్

ఎన్నికల కమిషనర్ కు కులముద్ర ఆపాదించడం ద్వారా ముఖ్యమంత్రే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడన్నారు.  పాలనలో ఘోరంగా విఫలమైనప్పుడే పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగానితనం ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతోనే ఎక్కువగా కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతుంటారని కళా వెంకట్రావు తేల్చిచెప్పారు.