హైదరాబాద్: స్కాట్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులను  రద్దు చేసినట్టుగా ఆయన చెప్పారు. 

బుధవారం నాడు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలిందని ఆయన ప్రకటించారు.

Also read:కరోనా: మలేషియా నుండి స్వదేశానికి 250 మంది తెలుగు విద్యార్థులు

 విదేశాల నుండి వచ్చేవారిని నేరుగా క్వారంటైన్ కు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరికొందరు అధికారులను నియమించినట్టుగా ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్యశాఖాధికారులతో  ఇవాళ ఉదయం సుధీర్ఘంగా చర్చించినట్టుగా మంత్రి చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు.  హైద్రాబాద్ నుండి గుల్బర్గా వెళ్లి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా  మంత్రి తెలిపారు. తెలంగాణలో ఒక్కరికి కూడ ఈ వ్యాధి సోకలేదన్నారు.

విదేశాల నుండి  సుమారు 20 వేల మంది వస్తారని తమకు సమాచారం ఉందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే వారందరికీ క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఎయిర్ పోర్టు నుండి  వదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను నేరుగా దూలపల్లి, వికారాబాద్ ఐసోలేషన్ వార్డులకు తరలించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్టు నుండి 40 బస్సుల ద్వారా ప్రయాణీకులను తరలిస్తామన్నారు.  గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో  ఉన్న ఐపీఎంలలో అన్ని ఏర్పాట్లు చేశామని ఈటల తెలిపారు.

కరోనాను ఆషామాషీగా తీసుకోకూడదని మంత్రి  ప్రజలను కోరారు. ప్రజలు ఎవరూ కూడ బయట గుంపులు గుంపులుగా తిరగకూడదని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడ  బయటకు రాకూడదని ఆయన సూచించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ఎవరూ కూడ మృతి చెందలేదన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికే ఈ వ్యాధి పాజిటివ్ లక్షణాలు సోకినట్టుగా ఆయన చెప్పారు.