తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి తాను వ్యతిరేకిస్తూ మాట్లాడినట్లు వస్తున్న ప్రచారం అవాస్తమని వైసిపి ఎంఎల్‌ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం తాను మాట్లాడిన మాటలను కొన్ని మీడియా సంస్ధలు వక్రీకరించాయని అన్నారు. తాను మాట్లాడినదానికి తల, తోక తీసేసి  పార్టులు పార్టులుగా విడగొట్టి ప్రసారం చేశారని...దీంతో తన మాటల అర్థమే మారిపోయిందన్నారు. 

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజధాని విషయంలో ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని... తన సహచర ఎమ్మెల్యేలు కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక ఒక్క హైద్రాబాద్‌ నగరాన్ని కోల్పోవడం వల్ల దీనివల్ల ఎన్ని నష్టాలు జరిగాయో ప్రజలందరికి తెలుసన్నారు. కేంద్ర సంస్ధలన్నీ కూడా అప్పటి రాజధాని హైద్రాబాద్‌ లోనే పెట్టడం వల్ల పెట్టుబడులు అక్కడకే వచ్చి సెంట్రలైజేషన్‌ జరిగిందని...దీంతో మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యం కాబడ్డాయన్నారు. ఇలా అభివృధ్ది అంతా కూడా అక్కడే జరిగిందన్నారు.

read more  చంపాలన్నదే తుగ్లక్ జగన్ దురాలోచన... ప్రత్యక్ష ఉద్యమానికి సిద్దం: దేవినేని ఉమ

సెంట్రలైజేషన్‌ జరిగి విభజన తర్వాత హైద్రాబాద్‌ నగరాన్ని కోల్పోవడం వల్ల మనం ఓ గుణపాఠం నేర్చుకున్నాం.అది తెలుసుకుని వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్‌ కమిటి కూడా చెప్పిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీలో అదే చెప్పారన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలలో వెనకబడిన జిల్లాలు దాదాపు ఏడు ఉన్నాయని వాటిని దృష్టిలో వుంచుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. సీఎం  తన ప్రకటనలో భాగంగా లెజిస్లేచివ్‌ కేపిటల్‌ అమరావతిలో, కర్నూలులో జ్యుడిషయల్‌ కేపిటల్,విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారని...ఆ దిశగా ఆయన ప్రయత్నాలు, నిర్ణయాలతో తామంతా ఏకీభవిస్తున్నామని గోపిరెడ్డి అన్నారు.

యాబై ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనంతో ఉందని.... ఇంకా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖలలో ప్రజలు కనీస అవసరాలకు దూరంగా అనేక రకాలుగా ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు. ఆ జిల్లాలను కూడా మనం అభివృధ్ది చేయాలనే జగన్ తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జులైలో ప్రమాణస్వీకారం చేశారని... డిసెంబర్‌ రాజధాని ప్రకటన చేసేశారన్నారు. ఈ మధ్యకాలంలో సుమారు నాలుగువేల ఎకరాలు టిడిపి నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి అసెంబ్లీలో వివరాలతో సహా ప్రకటించడం జరిగిందన్నారు. 

 ఇలా అమరావతిలో నాలుగువేల ఎకరాలు కొనుగోలు చేసి ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడ్డారని ఆరోపించారు. లంక ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల భూములను  తన బినామిలకు డెవలప్ మెంట్ కోసం అప్పగించారని... వాటిలో ప్లాట్లను తమవారికే లబ్ది చేకూరేవిధంగా చేశారన్నారు. రింగ్‌ రోడ్డు డిజైన్‌ ను తనకు అనుకూలంగానే రూపొందించుకున్నారని అన్నారు.

read more  జనసేన పార్టీ అమరావతి పర్యటన... ఆవేదనను వెల్లగక్కిన రాజధాని మహిళలు

అమరావతిలో ఇంత అవినీతి, భూములను సొంతవారికి కట్టబెట్టుకుని చంద్రబాబు స్వలాభం పొందడమే కాదు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్దిచేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సామాన్యుడు అమరావతిలో ఉండాలన్నా చాలా ఇబ్బంది కరమైన పరిస్దితి నెలకొందని పేర్కొన్నారు. 

అసలే ఏపిని చంద్రబాబు 3.62 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువెళ్లారని...నేడు రెండు లక్షలకోట్లతో రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమన్నారు. అంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టి అభివృధ్ది చేసుకునేకన్నా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేసుకునేవిధంగా చేయడం మంచిదని సీఎం అభిప్రాయమని... పెట్టుబడులు కావాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు.

ఒకేచోట అభివృద్ది జరిగితే నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వికేంద్రీకరణ అవసరమన్నారు. ముఖ్యమంత్రి జగన్  చేసిన ప్రకటనను అందరూ అర్దం చేసుకుని మద్దతు పలకాలన్నారు. తాను కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్‌ గారు అడుగుజాడలలో నడుస్తున్నానని... ఆయన  తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గోపిరెడ్డి తెలిపారు.