అసెంబ్లీ సమావేశాలకు అటంకం కలిగిస్తే కఠిన చర్యలు: గుంటూరు ఐజీ హెచ్చరిక
మంగళవారం ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ వెెల్లడించారు. పోలీసు అనుమతులు లేని ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనకూడదని హెచ్చరించారు.
గుంటూరు: మంగళవారం(20వ తేదీన) వివిధ రాజకీయ పార్టీలు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి, ఛలో అసెంబ్లీ, జైల్ భరో కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 సీఆర్‌పిసి నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే కాకుండా సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల విధులకు మరియు స్థానికులు, సామాన్య ప్రజల జీవనానికి అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి పోలీసుల అనుమతులు లేని కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనవద్దంటూ ఐజీ ఓ ప్రకటన విడుదల చేశారు.
read more జగన్ కాదు... ఆయన తాత రాజారెడ్డి దిగివచ్చినా అది సాధ్యం కాదు: బుద్దా వెంకన్న
రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలలోని ప్రజలు కొత్త వారిని ఎవరిని తమతమ నివాస ప్రాంతాలలో ఉండుటకు అనుమతించరాదని సూచించారు. అలాంటి వారిని అనుమతించడం వల్ల వారు అక్కడ హింసను ప్రేరేపించడం ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. కావున అలాంటి వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన వారి మీద కూడా చట్టబద్దమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ సహకరించిన వారిపైన మరియు వాహనాలు, ఇతర లాజిస్టిక్స్ సమకూర్చే వారిపైన తగిన చట్టబద్దమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలందరు శాంతిభద్రతల పరిరక్షణకై సహకరించాలని ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ కోరారు.
read more కుటుంబసభ్యులపై కేసు... మనస్తాపంతో అమరావతి రైతు మృతి