అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో తీవ్ర ఆందోళనలో వున్న అధినాయకత్వానికి తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు టిడిపిని వీడి  వైఎస్సార్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు.


 
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సన్యాసిపాత్రుడు వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ కండువా కప్పి  వైఎస్సార్‌సిపి అధ్యక్షులు, సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. సన్యాసిపాత్రుడుతో సహా నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, కొందరు టీడీపీ నాయకులు   వైఎస్సార్‌సిపిలో చేరారు.

 విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న  మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి గొప్ప షాక్ ఇచ్చాడు సోదరుడు.  సన్యాసి పాత్రుడు. వాస్తవానికి అయ్యన్నపాత్రుడు ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుకు ఏనాడు పొసగలేదు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నప్పటికీ సన్యాసిపాత్రుడు అంతగా పట్టించుకోలేదు. తాను మంత్రి సోదరుడుని అని ఏనాడు చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు.

read more  అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రచ్చ: వైసీపీలోకి తమ్ముడు, జగన్ గ్రీన్ సిగ్నల్

అంతేకాదు ఏ బహిరంగ వేదిక అయినప్పటికీ అయ్యన్నపాత్రుడు, సన్యాసపాత్రుడు ఎడమెుహం, పెడమొహం పెట్టుకునే ఉండేవారు. ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు. వేదిక పంచుకున్నప్పటికీ ఆయన పని ఆయనదే ఈయన పని ఈయనదే అన్నట్లు ఉండేది. మంత్రిగా అయ్యన్నపాత్రుడు ఉన్న సమయంలో తమ్ముడు సన్యాసిపాత్రుడు దూరంగా ఉండటంతో ఆ ప్లేస్ ను అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ భర్తీ చేశారు. నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో విజయ్ హల్ చల్ చేయడంతో సన్యాసిపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 అప్పటికే అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. విజయ్ ఆరంగేట్రంతో అది కాస్త మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ గా సన్యాసిపాత్రుడు భార్య అనిత వ్యవహరిస్తుండగా, సన్యాసి పాత్రుడు వైస్ చైర్మన్ గా ఉన్నారు. దీంతో తన మున్సిపాలిటీ పరిధిలో వేలుపెట్టొద్దంటూ విజయ్ ను పలుమార్లు పరోక్షంగా హెచ్చరించారు. ఆనాటి నుంచి సన్యాసిపాత్రుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తారంటూ వార్తలు హల్ చల్ చేశాయి.  

read more  చంద్రబాబుకు షాక్: టీడీపికి అయన్నపాత్రుడి సోదరుడు రాజీనామా

మెుత్తానికి అన్నయ్య మీద కోపం, అన్నయ్య కొడుకు విజయ్ ఆధిపత్య పోరును తట్టుకోలేకే సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  అంతేకాదు సన్యాసిపాత్రుడుపై ఆయన కుటుంబ సభ్యులే తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇక టీడీపీలో ఉండలేక వైసీపీలో చేరారు.