అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి గొప్ప సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటిది ఇక్కడి నుండి రాజధానిని తరలించాలన్న వైఎస్సా ర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ  విషయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని.... ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధానిని అమరావతి నుండి కదలనివ్వబోమన్నారు.  సేవ్ అమరావతి... సేవ్ ఆంద్రప్రదేశ్ అనేదే తమ నినాదమన్నారు. 

గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ఎన్టీఆర్ ను ఒక స్ఫూర్తి ప్రధాతగా అభివర్ణించారు. ఇప్పటికీ లక్షల మంది కార్యకర్తలు ఎన్టీఆర్ అందించిన స్పూర్తితోనే పనిచేస్తున్నారని అన్నారు. 

సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగి గొప్ప నేతగా మారారని అన్నారు. ఆయన లాంటి నటుడు  ఎప్పటికీ జన్మించరని అన్నారు. ఆయన మాదిరిగా ఎవరూ నటించలేరని అన్నారు. 

వీడియో  32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా

పార్టీపెట్టిన కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చారని...పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు లకు శ్రీకారం చుట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని అన్నారు. 

ఎన్టీఆర్ అందించిన స్పూర్తితోనే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. కామధేనువు లాంటి ఈ నగర నిర్మాణం పూర్తయితే ప్రతి ఒక్కరి ఆశలను అది నేరవేర్చేదని... అలా జరగడం ప్రస్తుతం సీఎం జగన్ కు ఇష్టం లేనట్లుందన్నారు. అమరావతిని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరు కదలాల్సిన సమయమిదని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

వీడియో  ఏపీ రాజధాని రగడ : రాజధానికోసం కాలభైరవ మహాయజ్ఞం..

తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ మాదిరిగానే రాజధాని కోసం అందరం కలిసి పోరాడదామని చంద్రబాబు అన్నారు. కేవలం పదవుల కోసం మాత్రమే తాము రాజకీయాలు చేయడం లేదని... తమ ముఖ్య విధి ప్రజాసంక్షేమ పాలన అందేలా చూడటమేనన్నారు. ప్రతిపక్షంలో వున్న తాము  ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.