Asianet News TeluguAsianet News Telugu

ప్రాణాలతో వదులుతారని అనుకోలేదు... డిఎస్పీ, అడ్వోకేట్ సైతం: మాచర్ల దాడిపై బోండా ఉమ

మాచర్లలో తమపై జరిగిన దాడిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఆ దాడి నుండి తాము  అసలు ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని ఆయన అన్నారు. 

Bonda Uma Reacts on Macharla Incident
Author
Amaravathi, First Published Mar 11, 2020, 2:33 PM IST

మాచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై వైసిపి శ్రేణులు బుధవారం దాడికి పాల్పడ్డారు.  వైసీపి నేతలే తమపై దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ దాడిపై బోండా ఉమ మాట్లాడుతూ... మాచర్లలో  అంతకుముందు టిడిపి అభ్యర్థి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వెళుతుంటే తాము ప్రయాణిస్తున్న వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. తమ వాహనాలతో పాటు రక్షణ కోసం వచ్చిన పోలీసు వాహనాలపై కూడా దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారని అన్నారు. 

read more  పిల్లాడిని ఢీకొట్టారు, అందుకే..:మాచర్ల ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

కర్రలతో తమపైనే కాదు అడ్వొకేట్‍ పై కూడా దాడిచేశారని తెలిపారు. ఈ దాడిలో తాము తీవ్రంగా గాయపడ్డామని... రక్తం కూడా కారుతోందన్నారు. తమకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నించిన స్థానిక డీఎస్పీపై కూడా దాడి చేశారని అన్నారు. తమకు పోలీసు రక్షణ ఉన్నా ఈ దాడి జరిగిందన్నారు. అక్కడి పరిస్థితిని చూస్తూ అసలు ప్రాణాలతో బయటపడతామనుకోలేదని బోండా ఉమ వివరించారు. 

పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. గాయపడిన టీడీపీ శ్రేణులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో బొండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడే పరిస్థితి లేకుండా పోయిందని బొండా ఉమా ఆరోపించారు. డీఎస్పీ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని, పోలీసులపై కూడా దాడి చేశారని ఆయన అన్నారు. 

read more  మాచర్ల దాడి: తప్పించుకుని తెలంగాణలోకి టీడీపీ నేతలు

వెంటపడి తమపై దాడి చేశారని బుద్ధా వెంకన్న అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎపీ నేతలు తెలంగాణకు వెళ్లి రక్షణ పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. 
 
తాము దాడి నుంచి తప్పించుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లామని టిడిపి నాయకులు చెబుతున్నారు. తమకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. కారుపై ఓ వ్యక్తి పెద్ద కర్రతో దాడి చేయడం టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. తమ పార్టీ నేతలపై దాడి మీద చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios