అది ఉన్నతవర్గాల హక్కు మాత్రమే కాదు... అందుకే ఈ నిర్ణయం..: విద్యా మంత్రి
నిరుపేద కుటుంబంలో పుట్టిన విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినట్లు విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అలాగని మాతృబాష తెలుగును కించపర్చబోమని...దానికి సముచిత స్థానం ఇస్తామన్నారు.
విజయవాడ: ప్రపంచ అవసరాలకు అనుగుణంగా నేటి విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించి వారిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలను ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఆంగ్ల బోధనకు ఉపాధ్యాయులను సంసిద్దులను చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు చేయడంతో పాటు మాతృ భాష తెలుగుకు కూడా సముచిత స్థానం ఇస్తామని ఆయన తెలిపారు.
సమర్ధవంతమైన సమాచార నైపుణ్యాలు విద్యార్థులకు అందజేయడం అవసరంగా మారిందన్నారు. ఆంగ్లం సార్వత్రిక భాష కనుక ఇందులో నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించడంతో పాటుగా అన్ని విషయాలను ఆంగ్ల మాధ్యమంలో పరిచయం చేయడం చారిత్రక అవసరంగా మారిందన్నారు.
ప్రస్తుతం వివిధ బోధనా మాధ్యమాలు రాష్ట్రంలో అమలు అవుతున్న నేపధ్యంలో బోదనామాధ్యమాల వారీగా విద్యార్థుల నైపుణ్యాలను సమానంగా పెంపొందించడం సవాలుగా మారిందన్నారు. అంతేకాక కొన్ని బోధనా మాధ్యమాల పట్ల వివక్ష కూడా మొదలై విద్యార్థుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మారిందని...వారిని సామాజిక వ్యతిరేక వర్గాలుగా తయారుచేసి ప్రమాదం అంచున కూడా ఉన్నామన్నారు.
read more తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకంటే...: దేవినేని ఉమ
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరాన్ని మంత్రి వివరించారు.ఈ సంవత్సరం అక్టోబర్ నెలాఖరున ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల నమోదును పరిశీలిస్తే మొత్తం 70,90,217
మంది విద్యార్ధులు నమోదులో 44,21,529 (62.36%) మంది విద్యార్ధులో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇతర వర్గాల వారు 82.62% కాగా వెనుకబడిన వర్గాల వారు 62.50% షెడ్యూల్డ్ కులాలవారు 49.61% మరియు షెడ్యుూల్డ్ తరగతుల వారు 33.23% మంది ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం సమాంతరంగా బోధిస్తున్నప్పటికినీ షెడ్యుల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల విద్యార్ధులు మాత్రం ఆంగ్ల మాధ్యమంలో బోధనకు నోచుకోక కేవలం ఉన్నత వర్గాలవారికే ఆంగ్ల మాధ్యమం పరిమితమైనట్లుగా పేద వర్గాలకు దూరం అయినట్లుగా ప్రస్ఫుటమవుతుందని పేర్కొన్నారు.
మనరాష్ట్రంలో బాలలందరు నాణ్యమైన విద్యను పొందడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దేందుకు ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరి అని భావించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2020-21 నుండి 1 నుండి 8వ తరగతి విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన రాష్ట్రంలో అన్ని పాఠశాలలో అందుబాటులో వచ్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
read more కోర్టు పరిధిలో వున్నా మీకోసం సాహసం చేస్తున్నా... ఇదే నా నిబద్దత..: అగ్రిగోల్డ్ సభలో జగన్
అదేవిధంగా 2021-22 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతి విద్యార్ధులకు, 2022-23 విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి విద్యార్ధులకు పూర్తిస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అందుబాటులోకి రానున్నదన్నారు.
విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనతో పాటు మాతృభాషకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం మాతృభాషను విద్యాబోధనలో తప్పనిసరి పాఠ్య విషయంగా చేర్చడమైందని తెలిపారు.
ఈ లక్ష్యసాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదన్నారు. ఉపాధ్యాయులను ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు సంసిద్ధులను చేసే క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం 1నుండి 8వ తరగతి వరకు బోధించే 98వేల మంది ఉపాధ్యాయులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కల్గిన ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్శిటి, హైదరాబాద్, మరియు రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగుళూర్ లోని ప్రొఫెసర్స్ ద్వారా నాణ్యమైన శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు.
జనవరి 2020 సంవత్సరం నుండి మే నెల 2020వరకు దశలవారీగా శిక్షణను ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యా సంస్కరణలో భాగంగా 1 నుండి 5వ తరగతి వరకు పాఠ్యప్రణాళికను ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మార్పుచేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యార్ధులకు బోధనను అందించి సార్వత్రిక అవసరాలకు ధీటైన నైపుణ్యాలను పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.
read more వెంకన్న భక్తులపై అదనపు భారం... టిటిడి కీలక నిర్ణయం
ఇక ఇదే అశంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థుల బావి తరాల భవిష్యత్ ను గుర్తు పెట్టుకుని ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది నుండీ 1 నుండి8 వతరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషు మీడియం లేక చాలా మంది విద్యార్థులు బయట ప్రదేశాలకు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని..జాతీయ స్థాయిలో,అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు మీడియం తప్పనిసరిగా పేర్కోన్నారు.
పేద వాళ్ళకు, వెనుక బడిన ప్రాంతంలో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి, ఇతర అన్ని భాషలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.