అమరావతి:నిత్యం ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాని వస్తుంటే మీరు అక్కడి రాకపోవడం ఏంటని మంత్రులపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారంలో రెండురోజులయినా  సంబంధిత శాఖ అధికారులకు అందుబాటులో వుండకుంటే ఎలాగంటూ సచివాలయానికి నిత్యం డుమ్మా కొడుతున్న మంత్రులపై జగన్ ఫైర్ అయ్యారు. 

ఇవాళ(బుధవారం) కేబినెట్  బేటీ అనంతరం మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత  రాజకీయ పరిణామాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. 

ప్రతిపక్ష పార్టీలు తమ పద్దతి మార్చుకోకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారికి సరైన సమాధానం ఇచ్చే బాధ్యత ప్రభుత్వంలోని వ్యక్తులుగా మంత్రులపైనే వుందని....వారు పొలిటికల్ కామెంట్లు మరింత ఎటాకింగ్ గా వుండాలన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారికి గట్టిగా సమాధానం ఇస్తూ గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. 

read more ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు: వర్గీకరణకు జగన్ కేబినెట్ విరుగుడు

ఇక ఇంచార్జ్ మంత్రులు తమకు అప్పగించిన జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టాలన్నారు సీఎం. సొంత జిల్లానే కాకుండా ఇంచార్జీగా ఉన్న జిల్లాలకు సమయం కేటాయించాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లోని సమస్యలను స్థానిక నేతలతో చర్చించి పరిష్కరించాలని జగన్ సూచించారు. 

 సచివాలయంకు మంత్రులు రాకపోవడంపై సీరియస్  అయిన సీఎం ఇకపై వారంలో రెండు రోజులు సెక్రటేరీయేట్ లో తప్పకుండా అందుబాటులో ఉండాలని మంత్రులకు ఆదేశించారు. మంగళ, బుధవారాల్లో మంత్రులు సెక్రటేరియట్ కు రావాలని జగన్ సూచించారు. 

ఇక అంతకుముందు జరిగిన కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలను ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపిన ఆయన ఒకవేళ తల్లి చనిపోతే గార్డియన్ కు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

Ap cabinet meet photos: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

విద్యార్థికి, తల్లికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకున్న వెంటనే వారికి రేషన్ కార్డు అందజేస్తామని మంత్రి నాని తెలిపారు. ప్రతీ ఏడాది జనవరిలో తల్లుల అకౌంట్లలో జమచేయబడుతుందన్నారు. జనవరి 26న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని ఆరోజే అర్హులైన తల్లుల అకౌంట్లో డబ్బులు జమచేయబడతాయన్నారు. 

ఇకపోతే గర్భిణీలకు, చిన్నారులకు అదనపు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందన్నారు. 77 మండలాల్లో ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.305 కోట్లు కేటాయించారని అందులో రూ.47 కోట్లు కేంద్రం అందిస్తుందన్నారు. 

ఇకపోతే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా కృష్ణా, గోదావరి నదుల నీటిని శుద్ధి చేసే విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పంటకాల్వల్లో 130 విభాగాలుగా నీరు వచ్చి చేరుతుందని తద్వారా కాల్వల్లో నీరు కలుషితం అయి క్యాన్సర్ వస్తుందని తెలిపారు. మురుగునీరును శుద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.   

read more జగన్...మంచి సీఎం అవుతానని ముంచే సీఎం అయ్యావేంటి..: లోకేష్ సెటైర్లు

రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర షెడ్యూల్ కులాల కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ప్రజా సంకల్పయాత్రలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని దాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందిచే వారికి వైయస్ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. విద్య, ఇంజనీరింగ్, సాంఘీక, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడా రంగాలలో విజయాలు సాధించి సమాజ హితం కోసం మంచి చేసే వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన 100 మందికి ఏడాదికి రెండుసార్లు అందజేయాలని రాష్ట్రమంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 26న 50 మందికి, ఆగష్టు 15న మరో 50మందికి అవార్డులతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదును ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.