తాడేపల్లి: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని. ఒకవేళ తల్లి చనిపోతే గార్డియన్ కు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

విద్యార్థికి, తల్లికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రేషన్ కార్డు లేకపోతే అప్లై చేసుకున్న వెంటనే వారికి రేషన్ కార్డు అందజేస్తామని మంత్రి నాని తెలిపారు. ప్రతీ ఏడాది జనవరిలో తల్లుల అకౌంట్లలో జమచేయబడుతుందన్నారు. జనవరి 26న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని ఆరోజే అర్హులైన తల్లుల అకౌంట్లో డబ్బులు జమచేయబడతాయన్నారు. 

ఇకపోతే గర్భిణీలకు, చిన్నారులకు అదనపు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందన్నారు. 77 మండలాల్లో ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి రూ.305 కోట్లు కేటాయించారని అందులో రూ.47 కోట్లు కేంద్రం అందిస్తుందన్నారు. 

ఇకపోతే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చైర్మన్ గా కృష్ణా, గోదావరి నదుల నీటిని శుద్ధి చేసే విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పంటకాల్వల్లో 130 విభాగాలుగా నీరు వచ్చి చేరుతుందని తద్వారా కాల్వల్లో నీరు కలుషితం అయి క్యాన్సర్ వస్తుందని తెలిపారు. మురుగునీరును శుద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.   

రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ను మూడు విభాగాలుగా విభజించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. మాల, మాదిగ, రెల్లి మరియు ఇతర షెడ్యూల్ కులాల కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ప్రజా సంకల్పయాత్రలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని దాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందిచే వారికి వైయస్ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులను అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. విద్య, ఇంజనీరింగ్, సాంఘీక, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడా రంగాలలో విజయాలు సాధించి సమాజ హితం కోసం మంచి చేసే వారిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన 100 మందికి ఏడాదికి రెండుసార్లు అందజేయాలని రాష్ట్రమంత్రిమండలి నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 26న 50 మందికి, ఆగష్టు 15న మరో 50మందికి అవార్డులతోపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదును ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండదండగా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతీ గ్రామంలో వైయస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

147నియోజకవర్గాల్లో వైయస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయం స్థాయిలో ఏర్పాటు చేసే అగ్రికల్చర్ ల్యాబ్ లో భూసారం తెలుసుకోవడంతోపాటు విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతపై తెలుసుకోవచ్చుననన్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఒక అగ్రికల్చర్ ల్యాబ్ లు ఏర్పాటుతోపాటు నాలుగు ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్రవేసిందని తెలిపారు.  

హజ్ యాత్రికుల కోసం, జెరూసలేం యాత్రికుల కోసం ప్రభుత్వం అందించే సాయాన్ని మరింత పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వార్షికాదాయం రూ.3లక్షలు లోపు ఉన్నవారికి రూ.60వేలు ఇవ్వాలని అలాగే రూ.3లక్షలు వార్షికాదాయం దాటిన వారికి రూ.30వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది. 

ఇకపోతే  స్టోన్ క్రషింగ్ యూనిట్లకు ఆరు నెలల్లోపు కంకర నుంచి రోబో శాండ్ తయారు చేసేందుకు కొత్త మిషనరీని అప్ గ్రేడ్ చేసుకునే వారికి అదనపు ఖర్చు రూ.50 లక్షల నుంచి రూ.1.50లక్షలు పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోబోశాండ్ ని అన్ని ప్రభుత్వనిర్మాణాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 20శాతం శాండ్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపింది.

అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివశిస్తున్న పేదవారికి ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో 300 చదరపు అడుగుల వరకు రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 100 చదరపు గజాలు భూమిలో ఉంటున్న వారు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారైతే 300 చదరపు అడుగుల భూములు కలిగి ఉన్నట్లైతే వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరను బట్టి రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. రెగ్యులరైజ్ అయిన భూములను ఐదు సంవత్సరాల వరకు అమ్మకూడదని, ఆ తర్వాత వారికి యజమానిగా హక్కులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

గత ప్రభుత్వంలో పేదవారి భూములను మరో పేదవారు కొనుగోలు చేస్తే వాటిని రెగ్యులరైజ్ చేసేందుకు ఆమోదం వేసినట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 397 లైన్ మెన్  ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే హోంశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు చేయూతగా జారీ చేసిన బాండ్ లకు హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు (పోటోలు )