మళ్లీ ఇసుక కొరత రాకుండా వుండాలంటే చేయాల్సిందిదే: సీఎం జగన్
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన ఇసుక కొరత జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులపాలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకుంటోంది.
అమరావతి: ఇసుక పాలసీ, అమలవుతున్న తీరుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుకను డోర్ డెలివరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జరుగుతున్న ఏర్పాట్ల గురించి సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జనవరి 2వ తేదీ కృష్ణా జిల్లాలో, జనవరి 7వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇసుకను ప్రభుత్వ యంత్రాంగమే డోర్ డెలివరీ చేయనుంది. జనవరి 20వ తేదీకల్లా అన్నిజిల్లాల్లో ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులకు సీఎం సలహాలు, సూచనలు చేశారు.
రాష్ట్రంలోని 200 పైచిలుకు స్టాక్ యార్డుల్లో 13 చోట్ల ఇసుక వెనువెంటనే అయిపోతుందని అధికారులు గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సమయాల్లో వీటికి సమీపంలో ఉన్న రీచుల్లో బుకింగ్‌కు అవకాశం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ మేరకు వెబ్‌సైట్లో మార్పులు, చేర్పులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం అధికారులకు ఆదేశించారు. రవాణాఛార్జీలు తగ్గుతాయని చాలామంది ఆ 13 స్టాక్‌యార్డుల నుంచే బుక్ చేస్తున్నారన్న అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈమేరకు ఇసుక లభ్యతను మరింత పెంచుతామని అధికారులు సీఎంకు తెలిపారు.
READ MORE రాయలసీమ రాజధాని అవసరమే లేదు... కావాల్సిందిదే: మంత్రి పెద్దిరెడ్డి
సగటున రోజుకు 80వేల టన్నులు ఇసుక విక్రయిస్తున్నామని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి ఇప్పటివరకూ బుక్ చేసుకున్న ఇసుక 43.7 లక్షల టన్నులు
గా వుందని తెలిపారు. స్టాకు యార్డుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక 9.6 లక్షల టన్నులుగా వుందని తెలిపారు.
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రణాళికతో వ్యవహరించాలన్న సీఎం అధికారులకు సూచించారు. రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున తవ్వి స్టాక్ చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నాలుగు నెలల్లో నెలకు 15 లక్షల టన్నులు చొప్పున వర్షాకాలంలో పనులకోసం రిజర్వ్ చేయాలన్న సీఎం ఆదేశించారు. సుమారు 60లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేసుకోవాలని అన్నారు.
మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. చెక్‌పోస్టుల ఏర్పాటుపై ఆరా తీసిన సీఎం 20 తేదీనాటికి చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ పూర్తికావాలని ఆదేశించారు.
READ MORE రైతుల పాపం ఊరికే పోదు... ఇంతకింతకు అనుభవిస్తారు: జగన్ పై బుద్దా ఫైర్
ఇప్పటికే 349 చెక్‌పోస్టుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేయగా ఇక్కడనుంచి కూడా లైవ్‌స్ట్రీమింగ్ కమాండ్ కంట్రోల్ రూంకు రావాలని సీఎం తెలిపారు. మిగిలిన చెక్‌పోస్టులు కూడా వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇసుకను సరఫరా చేస్తున్న అన్ని వాహనాలకూ జీపీఎస్ పెట్టారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరాతీశారు. 9020 వాహనాలకు జీపీఎస్ అమర్చామని అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు.