అమరావతి:  స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి నాడు నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కోన్నారు. ఈ కార్యక్రమంపై విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, వైద్యారోగ్య ఆరోగ్య శాఖ ఆళ్లనానిలతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పథకం అమలుకు సంబంధించి సీఎం వీరికి పలు సూచనలు చేశారు. 

రాష్ట్రంలోని దాదాపు 45వేల స్కూళ్లను నాడు నేడు కింద బాగుచేస్తున్నామని తెలిపారు. తర్వాత దశలో జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేస్తున్నామని వివరించారు. దీనికోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నామని పేర్కోన్నారు. 

ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్‌ ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నామన్నారు. 

ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌ లిస్టు ఉండాలని సూచించారు. నవంబర్‌ 14వ తేధీ చిల్ట్రన్స్ డే సందర్భంగా స్కూళ్లలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. 

read more నీ రహస్యాలన్నీ నాకూ తెలుసు... బయటపెట్టమంటావా...?: పవన్ కు బొత్స హెచ్చరిక

నాడు–నేడులో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాదు, నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 

వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించి పాఠ్యప్రణాళిక రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూలు ప్రారంభం కాగానే వారికి యూనిఫారమ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలని  సూచించారు. స్కూలు తెరిచిన తర్వాత సెప్టెంబరు,  అక్టోబరు వరకూ పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదని సూచించారు. 
అలాగే నాడు –నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులనూ బాగు చేస్తున్నామన్నారు. సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనా ఆసుపత్రులు కూడా బాగు చేస్తున్నామన్నారు. 

ప్రతి ఆస్పత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూడాలన్నారు. 510రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. డిసెంబర్‌ 15 నుంచి కూడా ఈమందులు అందుబాటులో పెడుతున్నామన్నారు.

read more  పార్టీని నడపడం ఆర్థిక భారమే... కానీ అదొక్కటి కావాల్సిందే..: పవన్ కల్యాణ్

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు బాగా పెరగాలన్నారు. వచ్చే మే నెల నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ కావాలని సూచించారు. జనవరిలో దీనికి  సంబంధించి భర్తీకోసం క్యాలెండర్‌ విడుదల చేయాలని సూచించారు.

పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి ఆర్థిక వనరులు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్‌కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలన్నారు.

ప్రతి విడతలో నాడు–నేడు కింద గ్రామీణ, గిరిజన, మున్సిపాల్టీల్లో స్కూళ్లు ఉండేలా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  ఆ మేరకే ప్రణాళిక తయారు  చేయాలన్నారు. స్కూలు యూనిఫారాల దగ్గర నుంచి ఫర్నిచర్‌ వరకూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.