Asianet News TeluguAsianet News Telugu

పార్టీని నడపడం ఆర్థిక భారమే... కానీ అదొక్కటి కావాల్సిందే..: పవన్ కల్యాణ్

విశాఖ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో  పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయన వారితో చర్చించారు.  

janasena chief pawan kalyan  meeting with vishakapatnam  party leaders and supporters
Author
Vishakhapatnam, First Published Nov 4, 2019, 10:56 PM IST

విశాఖపట్నం లాంగ్ మార్చ్ అనంతరం సభను అద్భుతమైన రీతిలో విజయవంతం చేసినందుకు విశాఖ జిల్లా జనసేన నాయకులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అభినందించారు. గత వారం రోజులుగా ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరినీ ఆయన మెచ్చుకున్నారు. 

సోమవారం విశాఖలోని ఓ హోటల్ లో జిల్లాకు చెందిన అభ్యర్ధులు, నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి  పవన్ కల్యాణ్ మాట్లాడారు... ప్రజలలో తీవ్రమైన ఆగ్రహం ఉన్నందునే నిన్నటి కార్యక్రమం అంత విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలంటూ దిశానిర్ధేశం చేశారు. 

జిల్లాలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామ, మండల, పట్టణ కమిటీలను నియమించడానికి సమాయత్తం కావాలని సూచించారు.  కమిటీల్లో జనసేన ఆవిర్బావం నుంచి నిస్వార్ధంగా పనిచేస్తున్న యువతకు తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆదేశించారు. 30 శాతంకు తగ్గకుండా వారే ఉండాలని ఆదేశించారు. అదే విధంగా కమిటీల నిర్మాణంలో రాజ్యాంగ బద్దంగా దేశంలో అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలని సూచన చేశారు. 

పార్టీని నడపడం ఆర్ధిక భారమైనప్పటికీ విశాఖపట్నంలో ఒక చక్కటి కార్యాలయాన్ని ఏర్పాటు చేద్దామని... అందుకు సరైన వసతి ప్రాంగణాన్ని సూచించాలని కోరారు. కార్యాలయంలో రీడింగ్ రూమ్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కార్యకర్తలను నాయకులు ప్రేమపూర్వకంగా ఆదరించాలని... మంచి పలకరింపు తప్ప వారు ఏమీ కోరుకోరన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని... ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై కార్యకర్తలను కలుపుకుని వెళ్లి పోరాడాలని చెప్పారు. 

 READ MORE చంద్రబాబు, లోకేశ్ విదేశీ ప్రయాణాలు అందుకోసమే...: లక్ష్మీపార్వతి

ముందస్తు ప్రణాళికతోనే లాంగ్ మార్చ్ విజయం: నాదెండ్ల మనోహర్

తొలుత సమావేశాన్ని ప్రారంభించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. నాయకులంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం పని చేయడంతో ఈ కార్యక్రమం విజయం సాధించిందని పేర్కొన్నారు. 

READ MORE నిరుద్యోగులే టార్గెట్... సచివాలయ ఉద్యోగాల పేరిట మోసం

 కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా ఇవ్వాలి:  వి.వి. లక్ష్మినారాయణ

జనసేన నాయకులు వి.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా నిరంతరాయ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. కార్యకర్తల మీద అక్రమ కేసులు అధికమవుతున్నందున వారికి మద్దతుగా పార్టీ లీగల్ విభాగాన్ని పటిష్టం చేయాలన్నారు. కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటానికి గాను రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అవగాహన కల్పించాలన్నారు. 

నాయకుల మధ్య అపోహలు పోవడానికి తరచుగా అంతర్గత సమావేశాలు నిర్వహించాలన్నారు. తాను కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నానన్నారు.

దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నుంచి బలంగా మాట్లాడే మీలాంటి వ్యక్తుల అవసరం ఉందని అన్నారు. మీరు ఆ ప్రాంతం మీద కూడా దృష్టి పెట్టాలని లక్ష్మీనారాయణను కోరారు. ఈ సమీక్షా సమావశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు  పి. రామ్మోహన్, అర్హం ఖాన్, విశాఖ జిల్లా నాయకులు  బొలిశెట్టి సత్య,  పి. శివశంకర్, పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్ధులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios