అమరావతి: శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు అమానుషంగా, దురుసుగా వ్యవహరించారని మందడం గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. ఈ మేరకు వారంతా కలిసి తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై అత్యంత పాశవికంగా వ్యవహరించి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

శాంతియుతంగా అమరావతి పరిరక్షణ కోసం నిరసన చేపట్టిన తమపై పోలీసులు దౌర్జన్యం చేసి ఇష్టానుసారంగా తిట్టడమే కాదు చేయికూడా చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను అరెస్ట్ చేసి బస్సులోకి ఎక్కించిన తర్వాత ఓ పోలీస్ సరిగ్గా కూర్చొమ్మంటూ బూతులను ఉపయోగించాడని... అవి బయటకు చెప్పలేనటువంటి బూతులని తెలిపారు.

మహిళలని కూడా చూడకుండా తమ పట్ల దారుణంగా వ్యవహరించారని మహిళలు వాపోయారు.తమని అసభ్య పదజాలంతో మాట్లాడి బౌతిక దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నట్లు మహిళలు తెలిపారు. 

read more  మా భూములపై విచారణ చేస్తే.. వైఎస్ భారతిపైనా జరపాలి: ధూళిపాళ్ల నరేంద్ర

తమ బట్టలు చినిగిపోయేలా, ఒంటిపై గాట్లు పడేలా పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అడ్డుగా నిలిచిన తమపైకి బస్సును ఎక్కించడానికి ప్రయత్నించారని... ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి తీవ్ర గాయమైనట్లు తెలిపారు.

తాము ఏదో  ఘోరమైన నేరం చేసిన వాళ్ళని ఈడ్చుకెళ్లి నట్లు ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు మహిళలని అసభ్యంగా తిట్టి గొంతుకూడా నులిమినట్లు మహిళలు తెలిపారు. 

ఇక ఇదే ఘటనపై హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ..రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలు శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా మందడంలోని బ్యాంకులు సమ్మెకు మద్దతు ఇవ్వాలని మహిళలు కోరగా అక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చి మహిళలతో అగౌరవంగా,అసభ్య పదజాలంతో వారిని దూషించారన్నారు. 

మహిళల్ని దూషించడమే కాకుండా 12 మందిని దుర్బషలాడి బస్సులో ఎక్కించే సమయంలో దుర్భాషలాడటం జరిగిందన్నారు. మహిళల గొంతు నులమడం, బస్సులో వేసి కుక్కడం, వారి బంగారు గాజులు,చెయిన్లు దొంగిలించడం జరిగిందన్నారు. బంగారు వస్తువులు పోలీసులు దొంగలించారా .?  లేక పోలీసుల ముసుగులో వేరే ఎవరైనా దొంగిలించారో తెలియడం లేదన్నారు.

read more  అమరావతిలో జగన్ నివసిస్తున్న ఇల్లు ఎవరిదంటే: వర్ల రామయ్య సంచలనం

ఇక్కడ జరిగిన తీరు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉన్నదన్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న రైతుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.  ఈ విషయాన్ని గవర్నర్, ఏపీ చీఫ్ జస్టిస్ దృష్టికి  తీసుకువెళ్తామన్నారు. ఒకవేళ పోలీసులు ఈ ఫిర్యాదు స్వీకరించకుంటే ప్రయివేట్ కేసులు వేస్తామని... హైకోర్టులో కూడా పిటిషన్ వేయనున్నట్లు లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.