కర్నూల్: అమరావతి ప్రజలకు అన్యాయం జరుగుతోందంటూ జోలె పట్టుకొని అడుక్కుంటున్న మాజీ సీఎం చంద్రబాబుకు మైనారిటీ సోదరులు ఎన్నార్సీ, ఎన్‌పిఆర్, సిఎఎ కి వ్యతిరేకంగా పోరాడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఈ  విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని  ప్రశ్నించారు.  అమరావతి ప్రాంతంలోని తన ఆస్తులు, బినామీల ఆస్తులు, బంధువుల ఆస్తుల  విలువ ఎక్కడ తగ్గిపోతుందోనని ఏకంగా రోడ్డుపైకే వస్తున్న ఆయన ఎన్నార్సిపై కనీసం మాట్లాడటానికి గొంతు  కూడా రావడంలేదా అని ఎద్దేవా చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...నంద్యాలలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారని గుర్తుచేశారు. తాను ప్రాతినిధ్యం వహించే నెల్లూరులో కూడా ముస్లీం జనాభా అధికంగా వుందని....తాను పోటీచేసిన ప్రతీసారి ముస్లింల ఓట్ల వల్లే గెలవగలిగాను అన్నారు.

read more  స్థానిక సంస్ధల ఎన్నికలకు సిద్దంకండి...: కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్

రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఊరుకోరని ముఖ్యంగా ముస్లింలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఎన్నార్సీని ఈ రాష్ట్రంలో రానిచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు.సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం ఎవ్వరికీ మంచిది కాదన్నారు.

పార్లమెంట్ లో తమ ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ మాట్లాడారు... అలా టీడీపీ ఎంపీలు మట్లాడారా...? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముస్లింకి అన్యాయం జరిగినా వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒప్పుకోమని స్పష్టం చేశారు.

10 సంవత్సరాలు తన రెక్కల కష్టంతో ఏకంగా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత వైసిపి అధినేతగా జగన్ దే  అని అన్నారు. ఇలా ప్రజల మన్ననలు పొంది 151 అసెంబ్లీ సీట్లు సాధించిన చరిత్ర భారత దేశ చరిత్రలో లేదన్నారు. అలాంటిది వైస్సార్సీపీ పార్టీని గాల్లో కలుపుతా అంటారా...? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని లాక్కున్న చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు దమ్ము, రాయలసీమ పౌరుషం,  ఉంటే ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని పక్కన బెట్టి కొత్తపార్టీ పెట్టి గెలవాలని అనిల్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీపై మమకారంతోనే ఇంకా అంతంత మాత్రంగా ఓట్లు వస్తున్నాయి తప్ప చంద్రబాబు ముఖం చూసి కాదన్నారు.

read more  తినేది బీజేపీ కూడు.. పాడేది జగన్ పాట: జీవీఎల్‌పై వర్ల వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు నాయుడు భస్మం అవుతాడని హెచ్చరించారు. కానీ జగన్ క్షమాగుణం, దయాగుణం ఉన్నవాడు కాబట్టే ఆయన ఎన్ని కుట్రలు చేస్తున్న చూస్తున్నారని అన్నారు. 

తామంతా జగన్ భక్తులమని... ఆయనపై  విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. టిడిపి నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపి అక్కడ తనకు అనుకూలంగా ఉండేలాగా చేసుకున్నాడని... ఇలా బీజేపీతో  ఇంకా సత్సంబంధాలు కలిగి ఉన్నాడన్నారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యులు బిజెపిలో ఎలా చేరతారని ఒక్కసారయినా నోరు విప్పని చంద్రబాబు ఇప్పుడు తమను రాజీనామ చెయ్యమనడం సిగ్గుచేటని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.